Mahaa Daily Exclusive

  గోదావరి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

Share

  • గోదావరి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
  • అనధికారిక ఇసుక నిల్వలు, ర్యాంపులపై కఠిన చర్యలు
  • అధికారిక సొసైటీ ర్యాంపుల నుంచే ఇసుక సరఫరా జరగాలి: సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

బూర్గంపహాడ్, మహా :
అధికారికంగా సొసైటీ సభ్యులు నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల నుంచే ఇసుక సరఫరా జరగాలని, అనుమతులు లేకుండా గోదావరి ఇసుకను తరలించడం, అక్రమంగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడం, అనధికారిక ర్యాంపులు నిర్వహించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట హెచ్చరించారు.

గురువారం ఉదయం బూర్గంపహాడ్ మండలం లోని సారపాక పరిధిలోని తాళ్లగొమ్మూరు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక నిల్వలను సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సోంపల్లి అధికారిక ఇసుక ర్యాంపుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని, అలాగే అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సొసైటీ సభ్యులు నిర్వహించే అధికారిక ర్యాంపుల నుంచే ఇసుక సరఫరా జరగాలని స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు గోదావరి పరిసర ప్రాంతాల్లో కంచెలు, కందకాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి కరకట్ట ప్రాంతాల్లో 24 గంటల నిఘా ఏర్పాటు చేసి, ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.

అనుమతులు లేకుండా ఇసుక తరలించే వ్యక్తులు, వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్ చేసి బాధ్యులను అదుపులోకి తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు.

భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇసుక ర్యాంపులపై ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తానని సబ్ కలెక్టర్ తెలిపారు. అధికారిక ర్యాంపులను నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా, నిజాయితీగా కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో డీటీ సమ్మయ్య, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.