Mahaa Daily Exclusive

  కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం….

Share

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.
• దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే.
• రెండేళ్లలో ‘సూపర్ సిక్స్’ హామీలు విజయవంతంగా అమలు.
• శ్రీకాకుళం సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
శ్రీకాకుళం,మహా.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని ఈ రెండేళ్ల పాలనలో వమ్ము చేయకుండా నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను ఈ రెండేళ్ల వ్యవధిలోనే విజయవంతంగా అమలు చేసి చూపించామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను సైతం దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిపథంలో శరవేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా ప్రగతికి మణిహారంగా మారనున్న మూలపేట పోర్టు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన సభకు వివరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నేరడి బ్యారేజ్ అంతర్రాష్ట్ర జల వివాదాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించామని, ఫలితంగా గెజిట్ నోటిఫికేషన్ సైతం సాధించగలిగామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న పారదర్శక విధానాల వల్ల దేశవ్యాప్తంగా వస్తున్న నూతన పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం వాటా ఏపీకే దక్కుతోందని ఆయన సగర్వంగా ప్రకటించారు. భారీ ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తుండటంతో రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.