Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ జాబితా రెండు వేలకు పైనే!

Share

ఫోన్ ట్యాపింగ్ జాబితా రెండు వేలకు పైనే!
* సొంత పార్టీ నేతల భార్యలు, పనిమనుషుల ఫోన్లూ వదల్లేదు.
* ఇదంతా కేసీఆర్, కేటీఆర్ చేయించిన పనే.
* సిట్ విచారణ అనంతరం చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్:మహా.
సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది. బషీర్‌బాగ్‌లోని ప్రత్యేక విచారణ బృందం (సిట్) కార్యాలయంలో శుక్రవారం అధికారులు ఆయనను దాదాపు గంటన్నర పాటు విచారించి, వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. విచారణకు హాజరయ్యే ముందు సిట్ కార్యాలయం సమీపంలోని అమ్మవారి ఆలయంలో ప్రవీణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ అధినేతలపై తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు గుప్పించారు.
ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని ప్రవీణ్ వెల్లడించారు. తన ఫోన్లను ట్యాప్ చేసి అత్యంత వ్యక్తిగత విషయాలను సైతం విన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా తాను తెలుసుకున్న వాస్తవాలు ఊహించిన దానికన్నా ఎంతో ఘోరంగా ఉన్నాయని తెలిపారు. కేవలం ఓ రెండు వందల మంది ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని తాను భావించానని, కానీ ఆ జాబితా రెండు వేలకు పైగానే ఉందని స్పష్టం చేశారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను సైతం వదల్లేదన్నారు. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే.. ట్యాపింగ్‌కు గురైన వాటిలో అత్యధికంగా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులవే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల భార్యలు, ఇళ్లలో పనిచేసే పనిమనుషుల ఫోన్లను సైతం ఆ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు.
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఎవరో తనకు తెలియదని మాజీ సీఎం కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని ప్రవీణ్ మండిపడ్డారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవోను జారీ చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరూ చేయలేరని దుయ్యబట్టారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం ముమ్మాటికీ కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. రాధాకిషన్ రావు అక్రమ ఆస్తులపై తక్షణమే విచారణ జరిపించాలని, లేనిపక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తనపై ఈడీ దాడులు జరగడానికి ముందు నుంచే తన ఫోన్ సంభాషణలను విన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ చేయించాలని కోరారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలన్నీ బట్టబయలు అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా ట్యాప్ చేశారని చికోటి ప్రవీణ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన సిట్ అధికారులు.. ప్రవీణ్ ఫోన్ ట్యాప్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు రాబట్టేందుకు ఆయనను విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.

Latest