క్వాంటం టెక్నాలజీలో అమరావతి అద్భుతం!
* స్వదేశీ పరిజ్ఞానంతో మైనస్ 269 డిగ్రీల అత్యంత శీతల వాతావరణం సృష్టి.
* విదేశాలపై ఆధారపడే దుస్థితికి చెక్.. దేశానికే తలమానికంగా క్వాంటం వ్యాలీ.
* సంవత్సర కాలంలోనే క్యూబిట్ ఫోర్స్, క్యూబిటెక్ సంస్థల అరుదైన ఘనత.
అమరావతి, మహా.
భారతదేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమరావతి క్వాంటం వ్యాలీ వేదికగా దేశ సాంకేతిక రంగంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. క్వాంటం అప్లికేషన్ల తయారీకి, పరిశోధనలకు అత్యంత కీలకమైన మైనస్ 269 డిగ్రీల (4 కెల్విన్) అత్యంత శీతల వాతావరణాన్ని అమరావతిలోని మేధా టవర్స్‌లో ఉన్న క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ విజయవంతంగా సృష్టించింది. వంద శాతం స్వదేశీ పరిజ్ఞానంతో డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా.. క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్‌లో దేశంలోనే ఏపీ అరుదైన మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది.
సాధారణంగా క్వాంటమ్ కంప్యూటర్లు ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత వేగంగా, సమర్థవంతంగా పని చేయాలంటే విపరీతమైన చల్లటి వాతావరణం తప్పనిసరి. ఇలాంటి సంక్లిష్టమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రత్యేక పరికరమే ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్. వాస్తవానికి ఇప్పటివరకు ఈ టెక్నాలజీ కోసం అగ్రరాజ్యాలు, ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, తాజా విజయంతో విదేశాలపై ఆధారపడే దుస్థితికి అమరావతి క్వాంటం వ్యాలీ శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ అద్భుత ఘనతతో అమరావతి ఫెసిలిటీ సెంటర్ ఇప్పుడు భారత్‌కే తలమానికంగా అవతరించింది. ఇకపై దేశీయంగానే క్వాంటం చిప్స్, సూపర్‌కండక్టింగ్ పరికరాలు, క్వాంటం సెన్సార్లు, కమ్యూనికేషన్ సాధనాలతో పాటు క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించే అవకాశం మనకు అందుబాటులోకి వచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో అమరావతిలోని మేథా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్శిటీల్లో క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో ప్రముఖ సంస్థలైన క్యూబిట్ ఫోర్స్, క్యూబిటెక్ ఆధ్వర్యంలో పరిశోధనలు ముమ్మరంగా సాగాయి. కేవలం ఏడాది కాల వ్యవధిలోనే క్రయోజెనిక్ సాంకేతికతలో ఈ సంస్థలు అసాధారణ ప్రగతిని సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ తాజా పరిణామంతో భవిష్యత్తులో భారతదేశ క్వాంటం రంగ ప్రగతిలో అమరావతి అత్యంత కీలక కేంద్రంగా మారనుంది. ఏకంగా 85 శాతానికి పైగా క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను స్థానికంగానే తయారు చేసేందుకు ఈ ప్రయోగం మార్గం సుగమం చేసింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక స్టార్టప్‌లు, జాతీయ పరిశోధనా ల్యాబ్‌లు, శాస్త్రవేత్తలకు అమరావతి క్వాంటం వ్యాలీ ప్రధాన దిక్సూచిగా నిలవనుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







