మైనర్లు డ్రైవింగ్ చేస్తే క్షమించే ప్రసక్తే లేదు!
* ర్యాంకుల సాధన కన్నా విద్యార్థుల భద్రతే అత్యంత ముఖ్యం.
* ఏం జరిగినా పాఠశాల యాజమాన్యాలదే పూర్తి బాధ్యత.
* స్కూల్ బస్సు డ్రైవర్ల తీరుపై నిరంతర నిఘా ఉంచాలి.
* రవీంద్రభారతిలో ట్రాఫిక్ అవగాహన సదస్సులో సీపీ సజ్జనార్ స్పష్టీకరణ.
హైదరాబాద్, మహా.
నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై, ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసు శాఖ ఏమాత్రం చూసీచూడనట్లు వదిలేయదని, వారిని అస్సలు క్షమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ‘స్కూల్ పిల్లల భద్రత’ అనే కీలక అంశంపై పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో భారీ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగర పరిధిలో దాదాపు 3,500లకు పైగా పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఏకంగా 12 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని గణాంకాలను వివరించారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న భావి భారత పౌరులకు అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని (సేఫ్ స్కూల్ ఎన్విరాన్మెంట్) కల్పించాలన్న బృహత్తర సంకల్పంతోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటించడాన్ని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన సూచించారు.
విద్యాసంస్థలు కేవలం ర్యాంకుల సాధన వెనుక మాత్రమే పరుగులు తీయడం సరికాదని, ర్యాంకుల కన్నా విద్యార్థులకు భద్రతతో కూడిన వాతావరణం కల్పించడమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని సీపీ సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యాలకు హితవు పలికారు. పాఠశాలలకు చిన్నారులను నిత్యం సురక్షితంగా చేరవేయాల్సిన బాధ్యత గల స్కూల్ బస్సుల డ్రైవర్లు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. విద్యార్థులు ఇళ్ల నుంచి స్కూల్‌కు ఏ వాహనాల్లో వస్తున్నారు, ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారు అనే దానిపై ప్రతి పాఠశాల యాజమాన్యం వద్ద కచ్చితమైన రూట్ మ్యాప్ ఉండాలని ఆదేశించారు. పిల్లలు ఇళ్ల నుంచి పాఠశాలకు బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇల్లు చేరే వరకు ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి వంద శాతం స్కూల్ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని ఆయన అత్యంత స్పష్టంగా హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే స్కూల్ బస్సు డ్రైవర్ల ప్రవర్తన, వారి అలవాట్లపై యాజమాన్యాలు నిరంతరం డేగకన్ను వేసి ఉంచాలని సూచించారు. అలాగే, పాఠశాలల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు విద్యాసంస్థలు సొంత ఖర్చులతో ట్రాఫిక్ వాలంటీర్లను, మార్షల్స్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలని ప్రతిపాదించారు.
ప్రస్తుత సమాజంలో పిల్లలు సైతం తెలిసీ తెలియని వయసులో ఎన్నో రకాల నేరాల్లో ఇరుక్కుంటున్నారని, దీనిని నివారించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రతి పాఠశాల పరిసరాల్లో భద్రతా ప్రమాణాల్లో భాగంగా కచ్చితంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాల్లో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించినా అది చట్టప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 45 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న హత్యల కంటే ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాలే అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. భవిష్యత్తు తరాల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకే ప్రతి స్కూల్ విద్యార్థికి ట్రాఫిక్ నిబంధనలపై సమగ్రమైన అవగాహన కల్పించే దిశగా పాఠశాలలు, తల్లిదండ్రులు కృషి చేయాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉద్ఘాటించారు.







