బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్.
* రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులు..
* ప్రతి 15 రోజులకోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశం.
* సాక్షులను ప్రభావితం చేయవద్దని హెచ్చరిక.
* రూ. 20 వేల చొప్పున రెండు ష్యూరిటీల సమర్పణ.
రంగారెడ్డి, మహా.
గండిపేట పరిధిలోని వివాదాస్పద భూకబ్జా, నకిలీ (ఫేక్) జీవో వ్యవహారంలో అరెస్ట్ అయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసును నిశితంగా పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు పలు కఠినమైన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ నిబంధనల్లో భాగంగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారుల ముందు బొల్లా బ్రహ్మనాయుడు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 20 వేల విలువైన రెండు వ్యక్తిగత ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్నంత కాలం సాక్షులను బెదిరించడం గానీ, సాక్ష్యాధారాలను మార్చడం గానీ చేస్తూ విచారణ ప్రక్రియను ప్రభావితం చేసేలా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించరాదని కోర్టు గట్టిగా హెచ్చరించింది.
ఈ సంచలన కేసులో ఆర్థిక నేరాల నిరోధక విభాగానికి (ఈవోడబ్ల్యూ) చెందిన పోలీసులు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. కస్టడీ గడువు ముగిసిన అనంతరం నిందితుడిని కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బ్రహ్మనాయుడు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో పోలీసులు తమ వాదనలను బలంగా వినిపించారు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే అసలు నిజాలు చెప్పకుండా దాటవేశారని, అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణలో ఏ అంశాన్ని అడిగినా.. ‘నాకేమీ తెలియదు’ అంటూనే కాలయాపన చేశారని, తాము ఆశించిన స్థాయిలో దర్యాప్తునకు ఆయన ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రతివాదనలు చేస్తూ.. పోలీసుల కస్టడీ గడువు ఇప్పటికే ముగిసిందని, చట్ట ప్రకారం ఆయనకు బెయిల్ పొందే పూర్తి అర్హత ఉందని న్యాయస్థానాన్ని కోరారు. ఇరుపక్షాల వాదోపవాదాలను సుదీర్ఘంగా విన్న రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం.. పోలీసు దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా పకడ్బందీ షరతులను విధిస్తూ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది.







