వేల్స్ తీరానికి వందలాదిగా కొట్టుకొచ్చిన నీలిరంగు వింత జీవులు!
*‘బై-ది-విండ్ సెయిలర్స్’గా గుర్తింపు.. అందంగా ఉన్నా తాకొద్దని హెచ్చరిక.
* తీరంలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సముద్ర స్ఫటికాలు.
లండన్,మహా.
బ్రిటన్‌లోని వేల్స్ సముద్ర తీరంలో అరుదైన, ఆకర్షణీయమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వందలాది నీలి రంగు సముద్ర జీవులు ఒక్కసారిగా తీరానికి కొట్టుకురావడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు. చూడటానికి ఎంతో అందంగా, నీలిరంగు స్ఫటికాల వలె మెరిసిపోతున్న ఈ జీవులు ఇటీవల వేల్స్ పరిధిలోని యాంగిల్సే, గ్వినెడ్, టెన్బీ బీచ్‌లలో భారీ సంఖ్యలో ప్రత్యక్షమయ్యాయి. టెన్బీ సౌత్ బీచ్‌లో ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన మాక్సీన్ అల్లిన్సన్ అనే పర్యాటకురాలు స్పందిస్తూ.. ఇవి తీరమంతా పరిచిన నీలిరంగు గాజు ముక్కల్లా, ఎంతో అందంగా ఉన్నాయని అభివర్ణించారు.
శాస్త్రీయంగా ‘వెలెల్లా వెలెల్లా’ అని పిలిచే ఈ వింత జీవులను సాధారణంగా ‘బై-ది-విండ్ సెయిలర్స్’ అని పిలుస్తుంటారు. ఇవి గాలి వీచే దిశను బట్టి సముద్ర ఉపరితలంపై తేలుతూ సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాయి. సుమారు 7 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ జీవులు, సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన ‘పోర్చుగీస్ మ్యాన్ ఓ వార్’ జాతికి సమీప పోలికలను కలిగి ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో గాలుల దిశ మారి, సముద్ర ప్రవాహాలు తీవ్రమైనప్పుడు ఇవి పెద్ద సంఖ్యలో ఇలా తీరానికి కొట్టుకు వస్తుంటాయని సముద్ర జీవ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అయితే, ఈ జీవులు చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో, అంతే ప్రమాదకరమని ఏంజెల్సీ సీ జూకు చెందిన మెరైన్ నిపుణురాలు ఫ్రాంకీ హోబ్రో హెచ్చరించారు. పర్యాటకులు వీటి అందాన్ని చూసి ముగ్ధులై ముట్టుకోవడానికి ప్రయత్నించవద్దని ఆమె స్పష్టం చేశారు. ఈ జీవుల శరీరంలో విషపూరితమైన కణాలు ఉంటాయని, ఒకవేళ ఇవి చనిపోయి తీరానికి చేరినప్పటికీ ఆ విష కణాలు చాలా రోజుల పాటు చురుకుగానే ఉంటాయని వివరించారు. వీటిని తాకడం వల్ల మానవ చర్మంపై తీవ్రమైన దురద, మంట, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, బీచ్‌కు వచ్చే సందర్శకులు వాటికి దూరంగా ఉంటూ కేవలం కళ్లతో చూసి మాత్రమే ఆనందించాలని అధికారులు సూచిస్తున్నారు.







