Mahaa Daily Exclusive

  కరోనా మృత్యుఘోష వెనుక కుట్ర….

Share

కరోనా మృత్యుఘోష వెనుక కుట్ర..
* అసలు సూత్రధారి ఆంథోనీ ఫౌచీనే!
* వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చి మారణహోమానికి కారణమయ్యారంటూ తులసి గబ్బార్డ్ సంచలన ప్రకటన.
* కాంగ్రెస్ సాక్షిగా పచ్చి అబద్ధాలు.. ప్రశ్నించిన అధికారులపై కక్షసాధింపు!.
* తన పదవీకాలం చివరి రోజున సీక్రెట్ పత్రాలను బయటపెట్టిన మాజీ నిఘా చీఫ్.
ఢిల్లీ, మహా.
ప్రపంచాన్ని స్మశానంగా మార్చి, కోట్లాది మంది ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్న కరోనా (కోవిడ్-19) మహమ్మారి వెనుక దాగిన అతిపెద్ద కుట్ర బట్టబయలైంది! మానవాళిని గడగడలాడించిన ఈ వైరస్ పుట్టుక వెనుక అసలు సూత్రధారి, అమెరికా మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీనే అని అమెరికా నిఘా విభాగం (డీఎన్ఐ) మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ బాంబు పేల్చారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదకరమైన ప్రయోగాలకు ఫౌచీనే స్వయంగా నిధులు సమకూర్చారని, ఈ మారణహోమాన్ని కప్పిపుచ్చేందుకు ప్రపంచాన్ని, ఏకంగా నిఘా వ్యవస్థలనే ఆయన నిలువునా మోసం చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తన పదవీకాలం ముగిసే చివరి రోజున (గురువారం) ఇంతకాలం వెలుగుచూడని అత్యంత రహస్య పత్రాలను తులసి గబ్బార్డ్ ప్రపంచం ముందు ఉంచి ఫౌచీ బండారాన్ని రట్టు చేశారు.
**వుహాన్ ల్యాబ్‌కు పన్ను చెల్లింపుదారుల సొమ్ము!**
కరోనా వైరస్ జంతువుల నుంచి సహజంగా పుట్టిందన్న ఫౌచీ వాదన ఒక పచ్చి అబద్ధమని తులసి గబ్బార్డ్ ఆధారాలతో సహా వెల్లడించారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని మిలియన్ల కొద్దీ డాలర్ల రూపంలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఫౌచీ మళ్లించారని ఆమె బహిర్గతం చేశారు. అక్కడ గబ్బిలాలపై కరోనా వైరస్ జన్యువులను మరింత ప్రమాదకరంగా మార్చే ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్’ ప్రయోగాలకు ఈ నిధులే ప్రాణం పోశాయని తేల్చి చెప్పారు. తీరా ఆ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ప్రపంచాన్ని కబళిస్తున్న సమయంలో.. తన మహా పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫౌచీ తన రాజకీయ పలుకుబడిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఇంటెలిజెన్స్ వర్గాలనే తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.
**కాంగ్రెస్ సాక్షిగా అబద్ధాలు.. ఫార్మా కంపెనీలతో కుమ్మక్కు**
గత 2024 జూన్‌లో అమెరికా కాంగ్రెస్ (చట్టసభ) ముందు ప్రమాణం చేసి మరీ ఫౌచీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని గబ్బార్డ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైరస్ ప్రయోగాల గురించి తాను నిఘా అధికారులతో ఎన్నడూ చర్చించలేదని ఆయన బుకాయించారని, కానీ ఇప్పుడు బయటపడిన పత్రాలు ఆయన కుట్ర పూరిత పాత్రను స్పష్టంగా నిరూపిస్తున్నాయని తెలిపారు. దాదాపు 38 ఏళ్ల పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అధిపతిగా ఉన్న ఫౌచీ.. బడా ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై ట్రిలియన్ డాలర్ల వ్యాపారం కోసం బరితెగించారని ఆరోపించారు. ‘యూనివర్సల్ వ్యాక్సిన్ల’ ముసుగులో అత్యంత ప్రమాదకరమైన పరిశోధనలకు ఆయన నిరంతరం నిధులు కురిపించారని మండిపడ్డారు.
**వ్యవస్థలనే శాసించి.. ఎదురుతిరిగిన వారిపై కక్షసాధింపు!**
ఫౌచీ తన అబద్ధాలను నిజం చేసేందుకు వ్యూహాత్మకంగా నిఘా వ్యవస్థలనే శాసించారని గబ్బార్డ్ ఆరోపించారు. తన సంస్థ నుంచి నిధులు పొందిన శాస్త్రవేత్తలనే స్వతంత్ర నిపుణులుగా నిఘా వర్గాలకు పరిచయం చేసి, వారు చెప్పిందే అధికారిక నివేదికలుగా మార్పించారని వివరించారు. అలా ‘ల్యాబ్-లీక్’ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫౌచీ కుట్రలను పసిగట్టి, ఆయన వాదనలను సవాలు చేసిన నిఘా విశ్లేషకులు, అధికారులపై దారుణమైన కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కెరీర్‌ను నాశనం చేశారని పలువురు విజిల్ బ్లోయర్ల సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయని గబ్బార్డ్ వెల్లడించారు.
“దశాబ్దాల తరబడి సాగిన అబద్ధాలు, కుట్రలతో దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి చేరకుండా ఫౌచీ అడ్డుకున్నారు. ఫౌచీ లాంటి నాయకులు తమ అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిఘా వ్యవస్థను కూడా వాడుకున్నారు. అమెరికా ప్రజలకు ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం కావాలి” అని ఆమె డిమాండ్ చేశారు. తులసి గబ్బార్డ్ తాజా ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మూలాలపై, డాక్టర్ ఫౌచీ పాత్రపై ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి!