భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలే లక్ష్యం.
* ఇంద్రకీలాద్రిపై విస్తృత తనిఖీలు చేపట్టిన ఈవో శీనా నాయక్.
* దుర్గాఘాట్, మహా మండపంలో వసతుల పరిశీలన.
విజయవాడ:మహా.
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) శీనా నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, దుర్గాఘాట్ తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. భక్తులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పవిత్ర స్నానాలు ఆచరించే దుర్గా ఘాట్ వద్ద పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి తేల్చిచెప్పారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తక్షణమే ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఘాట్ వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ టికెటింగ్ సేవలను ఈవో స్వయంగా పరిశీలించారు. కేశఖండన శాలలో సిబ్బంది హాజరు పట్టికను, భక్తుల ఫిర్యాదుల రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులతో ఈవో ముఖాముఖి మాట్లాడి, ఆలయంలో ప్రస్తుతం అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌బీఐ విరాళంగా అందజేసిన సిమెంట్ కుర్చీలు, కొత్త షెడ్లతో పాటు కూర్చోవడానికి చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు ఈ సందర్భంగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే వారి కోసం ఘాట్ రోడ్డులో అదనంగా 800 ఇనుప కుర్చీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. కనకదుర్గ నగర్‌లో హాకర్ల నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. ప్రసాదం కౌంటర్లలో విక్రయిస్తున్న స్టాక్ నాణ్యతను తనిఖీ చేశారు. మహా మండపంలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ బుకింగ్ కౌంటర్ల పనితీరును, పాత మెట్ల మార్గంలో భక్తుల సౌకర్యాలను సైతం ఆయన పరిశీలించారు. క్యూ లైన్లలో నిల్చునే భక్తులకు వేసవి దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన తాగునీటి సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులోనూ భక్తుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామని ఈవో శీనా నాయక్ వెల్లడించారు.







