టెక్నాలజీ మాటున ‘స్మార్ట్’ మత్తు దందా!
* డార్క్ వెబ్, ఈ-కామర్స్ వేదికగా ఇంటికే మాదకద్రవ్యాలు.
* క్యాబ్, కొరియర్ సేవల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా రవాణా.
* నకిలీ పాస్‌పోర్టులతో ఆఫ్రికన్ కింగ్‌పిన్స్ హవాలా మాయాజాలం.
* ఈగల్ అధికారుల నివేదికలో విస్తుపోయే నిజాలు.
హైదరాబాద్.మహా.
ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ ఇప్పుడు మత్తు వ్యాపారులకు అతిపెద్ద ఆయుధంగా మారింది. ఆన్‌లైన్‌లో ఒకే ఒక్క క్లిక్ చేస్తే చాలు.. నేరుగా ఇంటి తలుపు తట్టి మరీ మాదకద్రవ్యాలు అందిస్తున్న సరికొత్త ‘స్మార్ట్ డ్రగ్’ నెట్‌వర్క్ గుట్టు చూసి ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు పోలీసులు సైతం విస్తుపోతున్నారు. పేరు, చిరునామాకు ఏమాత్రం పొంతన లేకుండా, మనం నిత్యం ఉపయోగించే క్యాబ్, డెలివరీ అగ్రిగేటర్ యాప్‌ల ద్వారా ఈ మాఫియా తమ నెట్‌వర్క్‌ను నడిపిస్తోంది. ఈ స్మార్ట్ డ్రగ్ దందా వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్‌పిన్స్ ఎవరు? వారు అనుసరిస్తున్న వ్యూహాలు ఏమిటనే దానిపై దర్యాప్తు సంస్థ ‘ఈగల్’ అధికారులు తమ తాజా నివేదికలో పలు సంచలన నిజాలను బయటపెట్టారు.
**డార్క్ వెబ్ వేదికగా పక్కా స్కెచ్**
మాదకద్రవ్యాల రవాణా కోసం పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలికిన విక్రేతలు, టెక్నాలజీని తమ ప్రధాన కవచంగా మలుచుకుంటున్నారు. క్రయవిక్రేతల వివరాలు ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు అత్యంత రహస్యమైన ‘డార్క్ వెబ్’ను వేదికగా చేసుకుంటున్నారు. ఇందులో కొనుగోలుదారులు పూర్తిగా తప్పుడు పేర్లు, చిరునామాలు ఇస్తూ కేవలం మొబైల్ నంబర్ మాత్రమే అసలైంది నమోదు చేస్తున్నారు. ఆర్డర్ బుక్ అవ్వగానే వచ్చే ట్రాకింగ్ నంబర్ ఆధారంగా కస్టమర్లు తమ పార్శిల్ ఎక్కడికి వచ్చిందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేస్తున్నారు. చివరకు నేరుగా కొరియర్ కార్యాలయానికి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా సరుకును తీసుకుని వెళ్తున్నారు.
**ఈ-కామర్స్ సైట్ల ద్వారా గంజాయి చాక్లెట్లు**
మరోవైపు నగరంలో గంజాయి చాక్లెట్లను ఏకంగా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే చాలు.. సాధారణ వస్తువుల్లాగే వాటిని నేరుగా ఇంటికే హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు ప్రధానంగా నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాల నుంచి అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా నగరానికి చేరుకుంటున్నట్లు ఈగల్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.
**ఆఫ్రికన్ల పాస్‌పోర్టుల మాయాజాలం**
కొకైన్, హెరాయిన్ వంటి అత్యంత ఖరీదైన డ్రగ్స్ సరఫరాలో ఆఫ్రికా దేశాలకు చెందిన వారిదే ప్రధాన పాత్ర అని ఈగల్ నివేదిక కుండబద్దలు కొట్టింది. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే.. ఒకే వ్యక్తి వేర్వేరు దేశాలకు చెందిన నకిలీ పాస్‌పోర్టులతో మన దేశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే ఒక దేశం పాస్‌పోర్టును సమర్పించి, బెయిల్ రాగానే దర్జాగా మరో దేశం పాస్‌పోర్టుతో విదేశాలకు పరారవుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. “నిందితుడు పట్టుబడగానే రాష్ట్రంలోని ఫారెన్ రెసిడెన్స్ రిజిస్టర్ ఆఫీస్ కి అప్పగించాలి. వారు డిటెన్షన్ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ డేటా అంతా డిజిటలైజ్ కాకపోవడం వల్ల, వీరు తేలిగ్గా వేరే పాస్‌పోర్టుతో మళ్లీ దేశంలోకి వస్తున్నారు” అని విశ్రాంత ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి వెల్లడించారు.
**హవాలా మార్గంలో నల్లధనం ఎగుమతి**
ఈ డ్రగ్స్ విక్రయం ద్వారా ఆర్జించిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని కేటుగాళ్లు అత్యంత తెలివిగా హవాలా మార్గంలో తమ సొంత దేశాలకు చేరవేస్తున్నారు. నైజీరియా నుంచి దుస్తుల కొనుగోలు కోసం నగరానికి వచ్చే వ్యాపారులకు ఈ డ్రగ్స్ విక్రేతలు ఇక్కడి నగదును ఇస్తున్నారు. ఆ డబ్బుతో వారు దుస్తులు కొనుగోలు చేసి నైజీరియాకు ఎగుమతి చేస్తున్నారు. తిరిగి అక్కడ ఆ సరుకును అమ్మగా వచ్చిన సొమ్మును డ్రగ్ కింగ్‌పిన్స్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. పక్కా స్కెచ్‌తో సాగుతున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది.







