Mahaa Daily Exclusive

  రాహుల్ పుట్టినరోజు నాడే ‘రైతు డిక్లరేషన్‌’కు పాతర!

Share

రాహుల్ పుట్టినరోజు నాడే ‘రైతు డిక్లరేషన్‌’కు పాతర!
* బోనస్‌కు కోత.. కొనుగోళ్లలో ఆంక్షలు.
* ఇది అన్నదాతలను దగా చేసిన ‘ఫెయిత్‌లెస్’ కేబినెట్.
* ఐదు సీజన్లలో రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిన రైతు భరోసా రూ. 29,358 కోట్లు.
* యాప్‌ల పేరుతో యూరియా పంపిణీలోనూ రైతుల కష్టాలు.
*రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన మాజీ మంత్రి హరీశ్ రావు.
సిద్దిపేట:మహా.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్‌’ను రాష్ట్ర ప్రభుత్వం బొంద పెట్టిందని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయని, ఇది పేపర్ల కేబినెట్ కాదని.. రైతుల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని ‘ఫెయిత్‌లెస్’ (నమ్మకద్రోహ) కేబినెట్ అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
**మద్దతు ధరకు ఎసరు.. దళారుల పాలు**
కేంద్రం ఏ పంట కొనమంటే ఆ పంట, ఎంత కొనమంటే అంతే కొంటామని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చివరి గింజ వరకూ కొంటామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను దారుణంగా మోసం చేయడమేనన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కేంద్రం కొనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే భారాన్ని భరించి మక్కలు, జొన్నలు, రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడు కందులు, పెసలు, సన్‌ఫ్లవర్ లాంటి పంటలను కేంద్రం కేవలం 25 శాతమే కొంటే, మిగతా పంటను రైతులు దళారులకు అమ్ముకోవాలా? అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
**33 రకాల నుంచి 7 రకాలకే బోనస్.. బారీ కుట్ర**
సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీ విషయంలోనూ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మొదట అన్ని పంటలకు అన్నారని, ఆ తర్వాత వరికి మాత్రమేనని, ఆ తర్వాత 33 రకాల సన్నాలకు అని చెప్పి.. తీరా ఇప్పుడు షావుకారు లెక్కలు వేస్తూ కేవలం 7 రకాలకే బోనస్ కుదించడం అత్యంత దారుణమన్నారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల్లో బీపీటీ 520 లాంటి రకాలకు చీడపీడల బెడద ఎక్కువని, దిగుబడి కూడా ఎకరాకు కేవలం 20 క్వింటాళ్లకు మించదని తెలిపారు. తక్కువ దిగుబడి వచ్చే పంటలు వేస్తే రూ. 500 బోనస్ రావడం అటుంచితే, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గత యాసంగి, ఈ వానాకాలం సీజన్లకు సంబంధించి దాదాపు రూ. 1,900 కోట్ల బోనస్ నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు. సగం మంది రైతులు ఇప్పటికే పాత జాబితా ప్రకారం నారు పోశారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని నిలదీశారు.
**రైతు భరోసా, బీమా ఖతం**
రైతు భరోసా, రైతు బీమా పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా 11 విడతల్లో రూ. 74 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఎకరానికో మీటింగ్ పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 45 రోజుల్లో రైతు భరోసా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐదు సీజన్లలో రైతాంగానికి ఏకంగా రూ. 29,358 కోట్ల రైతు భరోసా బకాయి పడిందని లెక్కలతో సహా వివరించారు. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల గత ఐదు నెలలుగా (జనవరి నుంచి) రైతు బీమా పథకం నిలిచిపోయిందని, దీంతో చనిపోయిన 7,600 మంది రైతుల కుటుంబాలకు బీమా అందక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
**పోలీస్ స్టేషన్లలో యూరియా పంపిణీ దౌర్భాగ్యం**
ఎరువుల పంపిణీలోనూ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. యాప్‌ల పేరుతో ఆంక్షలు విధించి, ఎకరాకు కేవలం రెండే బస్తాల యూరియా ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేయడం వారి అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. మిర్చి, వరి లాంటి పంటలకు ఎక్కువ యూరియా అవసరమైతే రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంచే దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.
కాంగ్రెస్ పాలనలో కొనుగోళ్లు ఖతం, రైతు భరోసా ఖతం, రైతు బీమా ఖతం, యూరియా ఖతం అయ్యాయని, రైతులకు గోచి తప్ప మరేమీ మిగల్చలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చితే, రేవంత్ రెడ్డి పంటలు కొనలేక చేతులెత్తేశారని అన్నారు. వెంటనే ఈ కర్కశమైన వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుని రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అన్ని పంటలను యథావిధిగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.