నకిలీ ఓట్లు, రోహింగ్యాల ఏరివేతకే ఓటర్ల జాబితా సవరణ.
* ముస్లింల ఓట్లు తొలగిస్తారనేది కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల తప్పుడు ప్రచారమే.
* అర్హులైన ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించబోరు.
* బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు మన ఎన్నికల్లో ఓటు హక్కు ఎక్కడిది?.
* రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యకర్తల సదస్సులో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు.
హైదరాబాద్, మహా.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) అనేది భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ కార్యక్రమం కాదని, అది భారత ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా చేపట్టిన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన ఈ కీలక ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నాగోల్‌లో రంగారెడ్డి అర్బన్ జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఈ తరహా సవరణ ప్రక్రియ 11 సార్లు జరిగిందని, చివరిసారిగా 2002లో దీనిని నిర్వహించారని ఆయన పార్టీ శ్రేణులకు గుర్తుచేశారు.
గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సంఘం చేపట్టే ఈ ప్రక్రియను కనీసం వ్యతిరేకించలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మాత్రం ఒక పథకం ప్రకారం కుమ్మక్కై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లింల ఓట్లను జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారంటూ ఆ పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఏ వర్గానికి లేదా మతానికి చెందిన అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లనూ జాబితా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరని ఆయన హామీ ఇచ్చారు. అయితే, చనిపోయిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, నకిలీ ఓటర్లు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాల ఓట్లను ఏరివేయడానికే ఎన్నికల సంఘం ఈ సవరణ చేపట్టిందని స్పష్టం చేశారు. మన దేశ ఎన్నికల్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఓటు వేసే హక్కు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించిన ఆయన.. అలాంటి అక్రమ ఓట్లను కచ్చితంగా గుర్తించి జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఉద్ఘాటించారు.
ప్రజలు కాంగ్రెస్ బ్రాండ్ రాజకీయాలను దేశవ్యాప్తంగా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుండటాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని రామచందర్ రావు ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరిగిందని, అందులో అత్యధికం హిందువుల ఓట్లే ఉన్నాయని, అయినా అక్కడ అత్యధిక ఓట్లు తొలగించిన ప్రాంతాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందని ఆయన ఉదహరించారు. అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ గురించి ప్రతిపక్షాలు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీ ఎక్కడైతే రాజకీయంగా బలపడుతుందో, సరిగ్గా అక్కడ మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ ఓటమి భయంతో ఈ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.
భవిష్యత్తులో జరిగే ఎన్నికలన్నీ ఈ సవరించిన నూతన ఓటర్ల జాబితా ఆధారంగానే జరుగుతాయని, కాబట్టి బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు ఈ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా తీసుకోవాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త విధిగా ఇంటింటికీ తిరిగి ఓటర్లకు తగిన సహాయం చేయాలని, క్షేత్రస్థాయిలో చనిపోయిన వారిని, నకిలీ ఓట్లను గుర్తించాలని సూచించారు. ప్రతి బూత్‌కు వెళ్లి ఫారాలు నింపే ప్రక్రియను అర్థం చేసుకుని చురుగ్గా భాగస్వాములు కావాలని కోరారు. ఓటర్ల సవరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను వివరిస్తూ ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన గురుతర బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.







