చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై హెచ్-ఫాస్ట్ ఆకస్మిక దాడి!
* భారీగా అనారోగ్యకరమైన చికెన్, కల్తీ నూనె స్వాధీనం.. ఇద్దరు నిర్వాహకుల అరెస్ట్.
*ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాము బండారం బయటపడింది. నగరంలో ఆహార కల్తీ, అసురక్షిత పద్ధతులపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తో కలిసి హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం మేరకు చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించేలా అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో అక్కడ ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కనీస అనుమతులు లేకుండా, ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను నడిపిస్తున్నారు. ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు నిషేధిత, కృత్రిమ రంగులైన ఎంఎస్కే లయన్ గ్రీన్, రాస్ప్‌బెర్రీ రెడ్ వంటి రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నట్లు తేలింది. వీటికి తోడు పాడైపోయిన, అత్యంత ప్రమాదకరమైన వంట నూనెనే పదే పదే ఉపయోగిస్తున్నారని నిర్ధారించారు. కనీస నాణ్యత లేని నీటిని వాడటంతో పాటు, ఆ గోదాము పరిసరాల్లో కీటకాల నియంత్రణ లేకపోవడం వల్ల తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెలకొందని అధికారులు గుర్తించారు.
దాడుల అనంతరం ఈ గోదాము నుంచి సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, ఒక్కొక్కటి 15 లీటర్ల సామర్థ్యం గల 6 వంట నూనె టిన్నులు, ప్రాణాంతకమైన కృత్రిమ రసాయన ఆహార రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తూ చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జిస్తున్న నిందితులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీఆలం ఎస్హెచ్ఓకు అప్పగించారు.
ఇలాంటి కల్తీ, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదే పదే కాగిన నూనె వాడటం, కృత్రిమ రంగుల వల్ల దేహంలో విషతుల్యాలు పెరిగిపోయి కాలేయం దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ జీరో-టాలరెన్స్ (సహించేది లేదు) విధానాన్ని అనుసరిస్తుందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వినియోగదారులు కేవలం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్న సంస్థల నుంచే ఆహారాన్ని కొనుగోలు చేయాలని, ఆహారం తీసుకునే ముందు లైసెన్స్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. కృత్రిమ రంగులు కలిపిన, అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎక్కడైనా అసురక్షిత ఆహార పద్ధతులు, కల్తీ జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 8712661212 టోల్-ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఆహార భద్రతను కాపాడటంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు విజ్ఞప్తి చేశారు.







