Mahaa Daily Exclusive

  ఎల్బీ స్టేడియంలో క్రీడా విప్లవం….

Share

ఎల్బీ స్టేడియంలో క్రీడా విప్లవం..
* రూ.50.73 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
* విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి.
* గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో అంతర్జాతీయ స్థాయి అకాడమీల ప్రారంభం.
* ఘనంగా ‘యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్’ పంపిణీ.
హైదరాబాద్, మహా.
తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చేలా, యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అడుగులు వేసింది. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎల్బీ స్టేడియం వేదికగా శుక్రవారం ‘యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్’ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు 15 వేల మంది విద్యార్థుల ఉత్సాహపూరిత కోలాహలం మధ్య రాష్ట్రవ్యాప్తంగా క్రీడా రంగాన్ని సమూలంగా మార్చేలా ఏకంగా రూ. 50.73 కోట్ల విలువైన క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులందరితో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడల వైపు అడుగులు వేస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ మెగా ఈవెంట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
**జిల్లాల్లో క్రీడా మైదానాల నిర్మాణం**
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ వివిధ జిల్లాల్లో రూ. 36.65 కోట్లతో మినీ స్టేడియాల నిర్మాణం, ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌లో రూ. 10 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియానికి, సంగారెడ్డి జిల్లాలో రూ. 10 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియం ఆధునికీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. నారాయణపేట్ జిల్లా నర్వలో రూ. 4 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి, వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో రూ. 4 కోట్లతో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టారు. అలాగే, కామారెడ్డి జిల్లా గాంధారిలో రూ. 3.50 కోట్లతో, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 2.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియాలకు, మక్తల్ నియోజకవర్గం ఉట్కూరులో రూ. 2.50 కోట్లతో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు.
**అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీలు**
రాష్ట్రంలోని బాలబాలికలకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు రూ. 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో సరికొత్త అకాడమీలను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో బాలికల కోసం రూ. 5.70 కోట్లు, బాలుర కోసం రూ. 5.70 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీలను సీఎం ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలోనే బాలికల కోసం రూ. 35.95 లక్షలు, బాలుర కోసం రూ. 35.94 లక్షలతో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీలకు శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలో బాలికల కోసం రూ. 44.50 లక్షలు, బాలుర కోసం మరో రూ. 44.50 లక్షలతో రూపుదిద్దుకున్న హాకీ అకాడమీలను అందుబాటులోకి తెచ్చారు. ఎల్బీ స్టేడియంలో బాలుర కోసం రూ. 58.50 లక్షలతో నిర్మించిన ఫుట్‌బాల్ అకాడమీని, రూ. 49 లక్షలతో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
**విద్యార్థులకు ‘యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్’**
ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు కానుకగా ‘యంగ్ ఇండియా వెల్కమ్ కిట్లను’ గవర్నర్, సీఎం చేతుల మీదుగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిత్యావసర విద్యా సామగ్రితో కూడిన 22 రకాల వస్తువుల కిట్‌ను, ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే వారికి 10 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను బహూకరించారు. అలాగే నిత్యం పాఠశాలలకు వచ్చి వెళ్లే డే స్కాలర్ విద్యార్థులకు 7 రకాల అత్యవసర విద్యా సామగ్రితో కూడిన కిట్లను అందజేసి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణను విద్య, క్రీడా రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.