- పెద్దపల్లిలో వైద్య అవుట్సోర్సింగ్
- సిబ్బంది వేదన.. మూడు నెలలుగా అందని జీతాలు
పెద్దపల్లి, జూన్ 21 మహా
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత మూడు నెలలుగా తమకు జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని సిబ్బంది గుర్తు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, నెలలు గడుస్తున్నా వేతనాలు విడుదల కావడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇటీవల జీతాల జాప్యంపై అధికారులను హెచ్చరించినప్పటికీ, తమకు మాత్రం సమస్య తీరలేదని పేర్కొంటున్నారు.
అత్యవసర వైద్య సేవల్లో నిమగ్నమై, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న తమకు జీతాలు అందకపోవడం వల్ల ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి, తక్షణమే పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు







