Mahaa Daily Exclusive

  ఇండ్ల పోరాటానికి వామపక్షాలు సంసిద్ధం…

Share

  • ఇండ్ల పోరాటానికి వామపక్షాలు సంసిద్ధం
  •  ప్రతి నిరుపేదకు ఇల్లు
  • 10 వేల మందితో ఈ నెల 27న హనుమకొండలో భారీ ప్రదర్శన
  •  జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు
  • కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇళ్లు, ఇంటి స్థలం సాధించడమే లక్షంగా వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం తరహాలో  మరో పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్లు వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా గుండ్ల సింగారం, గోపాల్ పూర్ తొలగించిన గుడిసెల స్థానాలలో పేదలకు ఇళ్ల కట్టించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఐ(ఎం) ఇతర వాపపక్ష పార్టీల ఆధ్వర్యంలో 10 వేల మందితో ఈ నెల 27న హనుమకొండలో భారీ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో పేదలు నిలువ నీడ కోసం వేసుకున్న గుడిసెలను అధికారులు బందిపోటు దొంగలల చోరబడి రాత్రి రాత్రికి వాటిని తొలగించారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అత్యుత్సాహంటో  అధికారులు ఎక్కడెక్కడ గుడిసెలు తొలగించారో అక్కడ తిరిగి గుడిసెవాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లేకపోతే ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.
సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్యపద్మ, సిపిఐ ఎంఎల్ సి నెల్లికంటి సత్యం,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, వరంగల్ జిల్లా సెక్రటరీ బాషామియా, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ , సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, ఎంసిపిఐ నాయకులు సుధాకర్, ఎస్ నాయకులు భరత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు దక్కేలా కమ్యూనిస్టు పార్టీలు సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని వామపక్ష పార్టీలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన దశల వారి ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను సేకరించి జూలై 6న హైదరాబాద్ (ఇందిరాపార్క్) వేలాది మందితో ధర్నా నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పేదల నుంచి సేకరించిన దరఖాస్తులను నేరుగా సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్పందన మేరకు తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వారు చెప్పారు. ఈ ‘మహత్తర గుడిసెల పోరాటానికి’ ఏ పేరు పెట్టాలనేది జూలై 2న సమావేశమై నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.
అధికారులు, పోలీసులు దొంగల మాదిరిగా అర్ధరాత్రి ఇళ్ళను కూల్చడం దుర్మార్గం
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో గత 4 ఏళ్లుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే అధికారులు, పోలీసులు దొంగల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో గ్రామంపై పడి ఎలాంటి విచక్షణ లేకుండా పేదల ఇళ్ళను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా బలవంతంగా లాగిపడేసి అడ్డంవచ్చిన యువకులు, వృద్ధుల కాళ్ళు చేతులు మడిచి మరీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, సుమారు 300 నుండి 400 మందిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకప్పుడు అక్కడ ఉన్న ’కోమల కుంట’ అనే చెరువును ప్రభుత్వం పూడ్చి, ఎస్ కాల్వను తవ్వేందుకు సిద్ధమైందని, ఇదే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో 2009లోనే అప్పటి సిఎం రాజశేఖర్ రెడ్డి సర్వే నంబర్ 174, 175 కింద ఉన్న 56 ఎకరాల భూమిలో దాదాపు 1400 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మరో 40 మందికి ఇక్కడే పట్టాలు ఇవ్వగా ప్రస్తుతం బాధితులు కేవలం 8 ఎకరాల పరిధిలోనే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. ఇక్కడ, కాల్వ ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోయినా అధికారులు అత్సుహాంతో గుడిసెలు కూల్చివేశారని, ఇప్పటికే ఈ సర్వే నంబర్లలోని వందలాది ఎకరాలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. ఈ కూల్చివేతలకు సంబంధించి స్థానిక ఎంఎల్ ఏ వివరణ కోరగా తనకు తెలియదని తప్పించుకున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, సలహాదారు నరేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇదే తరహాలో రెండు రోజుల కింద గోపాల్ ప్రాంతంలో సిపిఐ(ఎం) నాయకత్వంలో పేదలు వేసుకున్న గుడిసెలను కూడా ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా కూల్చేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశారన్నారు. గతంలో వెలుగుమట్లలోనూ ఇలాగే జరిగిందని, కూల్చేసిన చోటే మళ్ళీ ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వారి ద్వంద్వ విధానానికి నిదర్శనమని విమర్శించారు. గోపాల్ గుండ్ల సింగారం బాధితులకు వెలుగుమట్ల తరహాలోనే ప్రత్యామ్నాయ ఇళ్ళు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో లక్షలాది మంది పేదలు 25, 30, 50 గజాల లోపు చిన్న చిన్న గుడిసెల్లో, మురికివాడల్లో నివసిస్తున్నారని వివరించారు. వీరంతా భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు, మిగులు భూముల్లో దశాబ్దాలుగా ఉంటున్నారని వీరందరికి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.