Mahaa Daily Exclusive

  క్రీడా స్ఫూర్తిని మంటగలిపిన అగ్రరాజ్యం…

Share

క్రీడా స్ఫూర్తిని మంటగలిపిన అగ్రరాజ్యం.
* అమెరికా తీరుపై ఇరాన్ కోచ్ తీవ్ర ధ్వజం!
* వీసా నిరాకరణ, ప్రయాణ ఆంక్షలతో జట్టుపై కక్షసాధింపు.
* ప్రాక్టీస్ వదిలేసుకుని హడావుడిగా లాస్ ఏంజిల్స్ చేరుకున్న వైనం.
* మేం వచ్చింది ఫుట్‌బాల్ ఆడేందుకు.. రాజకీయం చేయడానికి కాదు!
లాస్ ఏంజిల్స్:మహా.
ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌-2026కు ఆతిథ్యమిస్తున్న అగ్రరాజ్యం అమెరికా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇరాన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ అమీర్‌ ఘలానెయి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో పాల్గొంటున్న తమ జట్టుపై అమెరికా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించడంతో పాటుగా, ఉద్దేశపూర్వకంగా వీసాలు నిరాకరిస్తూ మానసికంగా వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి బెల్జియం జట్టుతో జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌ కోసం లాస్ ఏంజిల్స్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని ఎండగట్టారు.
ఒక ముఖ్యమైన మ్యాచ్‌కు కనీసం 24 గంటల ముందు వేదికకు చేరుకుని అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలని తాము భావించగా, అమెరికా అధికారులు మాత్రం కేవలం 16 గంటల సమయం మాత్రమే ఇచ్చారని అమీర్‌ ఘలానెయి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల మెక్సికోలోని తమ బేస్ క్యాంప్‌‌లో సగం ప్రాక్టీస్‌ను వదిలేసుకుని హడావుడిగా ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. అంతేకాకుండా, మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తిరిగి మెక్సికో వెళ్లిపోవాలనే కఠిన నిబంధన తమ ఆటగాళ్ల శారీరక, మానసిక సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఇరాన్ మిడ్‌ఫీల్డర్ సయీద్ ఎజటోలాహి ఆవేదన వ్యక్తం చేశాడు. వీటికి తోడు ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు, జట్టుకు అత్యంత కీలకమైన సపోర్టింగ్‌ స్టాఫ్‌, అలాగే తమ దేశ మీడియా ప్రతినిధులకు సైతం అమెరికా వీసాలు నిరాకరించి అడుగడుగునా వివక్ష చూపుతోందని కోచ్‌ ధ్వజమెత్తారు.
తాము ఇక్కడికి కేవలం ఫుట్‌బాల్‌ ఆడేందుకు మాత్రమే వచ్చామని, రాజకీయం చేయడానికి కాదని ఘలానెయి స్పష్టం చేశారు. తమ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మరణార్థం, వారి అంకితభావంతో తాము మైదానంలో ఆడుతున్నామని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా విధిస్తున్న ఈ అమానవీయ ఆంక్షల వల్ల తమ జట్టు క్రీడాపరంగా తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ వివక్షపై ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తోటి 47 దేశాల కోచ్‌లు నోరు విప్పాలని, క్రీడా స్ఫూర్తిని కాపాడేందుకు తమకు మద్దతుగా నిలవాలని బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో, తమపై ఆంక్షలను సడలించేందుకు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో చేస్తున్న కృషికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పరిణామాలపై తాము అధికారికంగా ఫిఫాకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా, జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా ఎలుగెత్తి చాటుతున్నామని పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ జట్టు ఎదుర్కొంటున్న ఈ దుర్భర పరిస్థితుల పట్ల ప్రత్యర్థి జట్టు బెల్జియం ఆటగాడు థామస్ మునియర్ సైతం తీవ్ర సానుభూతి వ్యక్తం చేశాడు. క్రీడాకారులకు ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, అది వారిలో మరింత కసిని రగిలిస్తుందని, తమ దేశం కోసం ఏమైనా చేసి గెలవాలనే పట్టుదలను అమాంతం పెంచుతుందని మునియర్ అభిప్రాయపడటం గమనార్హం. జాతీయ జట్టు కోసం వారు పడుతున్న తపన ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.