జై శ్రీరామ్’ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా.
* బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హిందూ సంఘాల తీవ్ర హెచ్చరిక!
* శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడంపై భగ్గుమన్న సనాతన సమాజం.
* భగవంతుడి చిత్రపటాన్ని అవమానించిన నిందితులను అరెస్ట్ చేయాలని 72 గంటల అల్టిమేటం.
* అనుమతి నిరాకరిస్తే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హిందూ మహాజోత్ ప్రకటన.
ఢాకా,మహా.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి విగ్రహ నిర్మాణం చుట్టూ అలుముకున్న వివాదం.. అక్కడ తీవ్ర స్థాయి రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది. రంగపూర్‌లో నిర్మిస్తున్న 81 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని అక్కడి ఇస్లామిక్ ఛాందసవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఒక నిరసన ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రపటంపై షూ ఉంచి అత్యంత దారుణంగా అవమానించారన్న వార్తలతో దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ అపచారానికి పాల్పడిన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకా నగరంలో వేలాది మంది హిందువులు కాగడాల ప్రదర్శనతో రోడ్లపైకి వచ్చారు. ఈ భారీ నిరసన ర్యాలీతో ఢాకా వీధులన్నీ ‘జై శ్రీరామ్’ నినాదాలతో సుదీర్ఘ సమయం పాటు దద్దరిల్లాయి.
**ఢాకా నడిబొడ్డున భారీ కాగడాల ర్యాలీ, మానవహారం**
బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహాజోత్ సహా పలు ప్రముఖ హిందూ సంస్థలు ఈ భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. రాజధాని ఢాకాలోని ప్రముఖ షాబాగ్ కూడలి వద్దకు వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులు, అక్కడి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ వెలుపల ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో హిందువులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని మానవహారంగా ఏర్పడి తమ నిరసన గళాన్ని విప్పారు. దీనికి తోడుగా ఢాకా రిపోర్టర్స్ యూనిటీ (డీఆర్‌యూ) భవనం సమీపంలో సైతం మరో బలమైన నిరసన కార్యక్రమం పకడ్బందీగా సాగింది. మరోవైపు, రంగపూర్‌లో శాంతియుతంగా ప్రదర్శన చేపట్టేందుకు ప్రయత్నించిన హిందూ సంఘాల కార్యకర్తలను అక్కడి పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఉభయ పక్షాల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
**అసలేమిటీ విగ్రహ ప్రాజెక్ట్?**
బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న గైబంధా జిల్లా పలాశ్‌బరిలో శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక బృహత్తర ఆలయ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా సనాతన సంస్కృతిని ప్రతిబింబించేలా 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహంతో పాటు, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాలను ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది. దాదాపు 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (సుమారు మన కరెన్సీలో రూ. 15.6 కోట్లు) భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో.. అత్యంత కీలకమైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణం ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయింది. అయితే, దురదృష్టవశాత్తూ స్థానిక ఇస్లామిక్ గ్రూపుల నుంచి ప్రాణ బెదిరింపులు, హెచ్చరికలు రావడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ ఆవేదనతో వెల్లడించారు. తామంతా ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ బతుకుతున్నామని, అందుకే పనులను ఆపేశామని స్పష్టం చేసిన ఆయన.. సనాతన ధర్మంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
**ప్రభుత్వానికి 72 గంటల గడువు.. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు**
ఈ నెల ప్రారంభంలో గైబంధాలో ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు నిర్వహించిన నిరసనలో, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీరాముడి చిత్రపటంపై కాళ్లు పెట్టి, షూ ఉంచి అవమానించిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ ఇంతవరకు అధికారులు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడంపై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం మైనారిటీల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. చిత్రపటాన్ని అవమానించిన నిందితులను రాబోయే 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ప్రభుత్వానికి కఠినమైన అల్టిమేటం జారీ చేశాయి. లేనిపక్షంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. విగ్రహ నిర్మాణానికి తిరిగి రక్షణతో కూడిన అనుమతులు ఇవ్వకపోతే, బంగ్లాదేశ్‌లోని మొత్తం 64 జిల్లాల్లో స్వయంగా రామాలయాలను నిర్మించి తీరుతామని హిందూ మహాజోత్ స్పష్టం చేయడంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది.
**తెరపైకి మైనారిటీల రక్షణ.. పెరిగిన హింస**
బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో సుమారు 8 శాతం మంది ఉన్న హిందువులు.. ఆ దేశంలోనే అతిపెద్ద మైనారిటీ వర్గంగా కొనసాగుతున్నారు. గతంలో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం తర్వాత, అక్కడ హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు భారీగా పెరిగాయన్న అంతర్జాతీయ నివేదికల నేపథ్యంలో తాజా వివాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి పౌరుడికి తమ తమ మతాలను స్వేచ్ఛగా ఆచరించే పూర్తి హక్కు ఉందని ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహమాన్ పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనేది వాస్తవం. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య కేవలం మూడు నెలల వ్యవధిలోనే బంగ్లాదేశ్‌లో ఏకంగా 133 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు కావడం అక్కడి సనాతన ధర్మీయుల అభద్రతా భావానికి, శాంతిభద్రతల క్షీణతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.








