Mahaa Daily Exclusive

  అన్నదాతలను ఇబ్బంది పెడితే.. క్రిమినల్ కేసులే!

Share

అన్నదాతలను ఇబ్బంది పెడితే.. క్రిమినల్ కేసులే!
* ఎరువుల డీలర్లు, కంపెనీలకు మంత్రి అచ్చెన్నాయుడు కఠిన హెచ్చరిక.
* సచివాలయంలో ఖరీఫ్-2026 సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష.
* బలవంతపు విక్రయాలకు తక్షణమే స్వస్తి పలకాలని ఆదేశం.
అమరావతి, మహా.
రైతన్నలను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సదరు ఎరువుల కంపెనీలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ఎరువుల లభ్యత, పంపిణీ తదితర అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ కొనుగోలు చేసే రైతులపై ఇతర కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలును బలవంతంగా రుద్దే విధానానికి తక్షణమే స్వస్తి పలకాలని తేల్చిచెప్పారు. రైతులకు ఏ ఎరువులు అవసరమో వాటిని మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన మేర కంటే అధికంగానే ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా ‘ఎరువుల బుకింగ్ యాప్’ నిర్వహణ సజావుగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇదే సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే ‘నానో యూరియా’ ప్రయోజనాలపై గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతాంగం ఆసక్తి చూపుతున్నారని, రసాయన ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి, తగిన మోతాదులోనే వాటిని వినియోగించేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
ఎరువులను కేవలం ఎమ్‌ఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర)కే విక్రయించాలని, నిర్ణీత ధరకు మించి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా డీలర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు తక్షణమే ప్రత్యేక విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ అయ్యే ప్రతి ఎరువుల బస్తాకు పక్కా లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలా అక్రమాలకు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్య అంశమని, అన్నదాతల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు.