సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.
* విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్.
* షూటింగ్ బిజీతో ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు.
• తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు.
హైదరాబాద్, మహా.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో జరిగిన విచారణకు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న ఆయన.. న్యాయస్థానం ముందస్తు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా విచారణకు అటెండ్ అయ్యారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన నిందితులంతా న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ-11గా చేర్చిన విషయం విదితమే. సోమవారం ఉదయం ఈ కేసు విచారణకు రాగా.. నిబంధనల ప్రకారం ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ముంబైలో ఉన్నారని, కాబట్టి అక్కడి నుంచే వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.
ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు వర్చువల్ హాజరుకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. దీన్ని న్యాయస్థానం రికార్డుల్లో నమోదు చేసుకుంది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, వాయిదా పడిన తదుపరి విచారణ రోజున కూడా అల్లు అర్జున్ కోర్టుకు నేరుగా వస్తారా? లేక మరోసారి వర్చువల్‌గానే హాజరవుతారా? అనేది వేచిచూడాల్సి ఉంది.








