Mahaa Daily Exclusive

  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేట.

Share

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేట.
* గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూముల బదలాయింపుపై కృతజ్ఞతలు.
• ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి .
• దేవరకద్రలో డీఆర్‌డీఓ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి.
ఢిల్లీ, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సౌహార్దపూర్వక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక రక్షణ, విమానయాన రంగ ప్రాజెక్టులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించినందుకు గాను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి తమ ప్రభుత్వం భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఆదిలాబాద్‌లో రానున్న భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) ఎయిర్‌పోర్ట్‌ను భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్‌ను కూడా నిర్మించాల్సి ఉందన్నారు. దీంతో పాటు అక్కడ కార్గో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎమ్‌ఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్), హ్యాంగర్ సౌకర్యాలను పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కేంద్ర రక్షణ శాఖ చొరవ చూపి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇటీవలి కాలంలో పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో చోటుచేసుకున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. కాబట్టి ఆ దిశగా ఈ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని కోరారు. వీటితో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీఓ లేదా డీఆర్‌డీఎల్ సంస్థలు ఇప్పటికే ఎంచుకున్న ప్రదేశంలో.. వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్‌ను త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.