బయ్యారంలో కలకలం.
* 30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత.
* స్మగ్లర్ల స్థావరంపై అటవీశాఖ అధికారుల మెరుపు దాడులు .
• అధికారులతో వేటగాళ్ల వాగ్వాదం.. ఒకరి అరెస్ట్.
• ద్విచక్ర వాహనం, మాంసం స్వాధీనం.. మిగిలిన నిందితుల కోసం గాలింపు.
మహబూబాబాద్,మహా.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అడవి జంతువుల మాంసం అక్రమ విక్రయాల ఉదంతం కలకలం రేపింది. మండల కేంద్రంలోని కాకతీయనగర్ పరిధిలో కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడి, వాటి మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 30 కిలోల అడవి జంతువుల మాంసంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అధికారుల రాకను ముందే గమనించిన కొందరు స్మగ్లర్లు, వేటగాళ్లు అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారు.
సోమవారం ఉదయం అధికారులు కాకతీయనగర్‌లోని సదరు స్థావరంపై దాడి చేసిన సమయంలో మాంసం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అటవీశాఖ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మరికొందరు వేటగాళ్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చి, నిందితుడిని బంధించి ప్రాథమిక విచారణ చేపట్టారు.
ఈ అక్రమ వేట, విక్రయాల ఘటనపై అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద అధికారులు కేసు నమోదు చేసి నిఘా తీవ్రం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. అడవి జంతువులను వేటాడినా, వాటి మాంసాన్ని విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వన్యప్రాణుల సంరక్షణను బాధ్యతగా భావించి, అడవుల్లో ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం అందించి సహకరించాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







