అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల.
* జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్.
* జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ.
* సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాల స్వీకరణ.
*నగరంలో 22 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి.
* బీఎల్‌వోలతో కలిసి పనిచేయాలని పార్టీలకు పిలుపు.
హైదరాబాద్, మహా.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా రాబోయే జులై 31వ తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ముద్రిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారికంగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించి కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. జులై ఆఖరుకు ముసాయిదా సిద్ధం చేసిన అనంతరం, సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులు, మార్పులు చేర్పులకు సంబంధించిన విజ్ఞప్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని కమిషనర్ ప్రకటించారు.
నగర పరిధిలో ఓటర్ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, మిగిలిన మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని, బీఎల్‌వోలతో పాటు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లు చురుగ్గా పాల్గొని ఓటర్ల నమోదు, సవరణలు సక్రమంగా జరిగేలా సహకరించాలని ఆర్.వి. కర్ణన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.








