షీర్వాల్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణాలు.
* రెండో విడతలో గుడిసెవాసులకే పెద్దపీట!
* రాష్ట్రవ్యాప్తంగా 24 వేల పూరిళ్ల గుర్తింపు.
* నిర్మాణ వ్యయానికి చెక్ పెట్టేలా సర్కారు ప్రణాళికలు.
హైదరాబాద్, మహా.
పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం రెండో విడతకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి విడత కింద ఇప్పటికే ఇళ్లను మంజూరు చేసి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. రెండో విడతలో నిరుపేదలకు, ముఖ్యంగా పూరి గుడిసెల్లో నివసించే వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి కేవలం 15 రోజుల్లోనే పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చేలా అత్యాధునిక ‘షీర్వాల్’ టెక్నాలజీని వినియోగించేందుకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (హౌసింగ్ కార్పొరేషన్) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత సర్వే చేపట్టారు. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24 వేల మంది నిరుపేదలు ఇంకా పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కింద మొదటి ప్రాధాన్యత కల్పించనున్నారు. సాధారణంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. కానీ ప్రస్తుత మార్కెట్లో ఇసుక, సిమెంట్, ఇటుక, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలకు తోడు లబ్ధిదారులు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని గుడిసెవాసులు ముందుగా పెట్టుబడి పెట్టి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకపోవడంతో, ప్రభుత్వమే షీర్వాల్ విధానంలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.
షీర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇంటి నిర్మాణ వ్యయం భారీగా తగ్గడమే కాకుండా, పనులు అత్యంత వేగంగా పూర్తవుతాయి. 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో మొత్తం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నమూనా ఇంటిని డిజైన్ చేశారు. నిర్మాణంలో ఇటుకల వాడకం లేకుండా 8ఎంఎం, 10ఎంఎం స్టీల్, రెడీమిక్స్డ్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్, అల్యూమినియం ప్యానెల్స్‌ను విరివిగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో పునాది వేయడానికి ఐదు రోజులు, శ్లాబ్ నిర్మాణానికి ఆరు రోజులు, ప్లాస్టరింగ్ తదితర పనులకు మరో నాలుగు రోజులు పడుతుంది. మొత్తంగా కేవలం 15 రోజుల్లోనే సర్వాంగ సుందరమైన ఇల్లు ముస్తాబవుతుంది. దీనికయ్యే ఖర్చు కూడా బడ్జెట్ పరిమితుల్లోనే ఉండటం గమనార్హం.
ఈ నూతన సాంకేతికత ఇప్పటికే క్షేత్రస్థాయిలో విజయవంతంగా పరీక్షించబడింది. గతేడాది సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ స్టార్టప్ కంపెనీ 400 చదరపు అడుగుల్లో ఈ తరహా నమూనా ఇంటిని నిర్మించి విజయం సాధించింది. అలాగే, ఇటీవల కుమురం భీం జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో కూడా షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గుడిసెవాసులందరికీ ఇదే పద్ధతిలో సురక్షితమైన, నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది.







