రైళ్లలో భిక్షాటన చేస్తే రూ.2 వేల జరిమానా.
* రైల్వే కొత్త నిబంధనలు అమలు!
*ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం ‘జన విశ్వాస్’ పేరిట చట్టంలో మార్పులు.
* మహిళల కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 ఫైన్.
* కట్టకుంటే కోర్టులో హాజరు.
*ఈ నెల 15 నుంచే క్షేత్రస్థాయిలో ఆర్పీఎఫ్ అధికారులకు జరిమానాల వసూలు అధికారం.
హైదరాబాద్, మహా.
రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ప్రాంగణాల్లో క్రమశిక్షణను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 1989 నాటి రైల్వే చట్టంలో పలు కీలక సవరణలు చేస్తూ ‘జన విశ్వాస్’ పేరిట సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అనధికారికంగా తిష్టవేసే ఆకతాయిలు, భిక్షాటన చేసేవారు, అనుమతి లేకుండా తినుబండారాలు అమ్మే చిరువ్యాపారుల వల్ల ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ భారీ జరిమానాలను ఖరారు చేశారు. సవరించిన ఈ నూతన చట్టాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆదివారం కాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ, ఎస్సై వెంకట్‌రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు.
**నిబంధనల ఉల్లంఘనలపై విధించే సవరించిన జరిమానాల వివరాలు ఇలా ఉన్నాయి:**
రైల్వే అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా స్టేషన్లలో, రైళ్లలో తినుబండారాలు అమ్మే హ్యాకర్లకు, అలాగే భిక్షాటన చేసే వారికి ఇకపై రూ. 2,000 భారీ జరిమానా విధించనున్నారు. అత్యంత కీలకమైన మహిళల రిజర్వ్ కోచ్‌లలోకి పురుషులు ప్రవేశిస్తే రూ. 2,500 జరిమానా విధిస్తారు. రైల్వే ప్రాంగణంలో లేదా రైలు భోగీల్లో ధూమపానం (స్మోకింగ్) చేస్తూ పట్టుబడితే రూ. 2,000, స్టేషన్లలోకి లేదా రైళ్లలోకి ప్రమాదకరమైన వస్తువులను తీసుకువస్తే ఏకంగా రూ. 10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు.
మరోవైపు, రిజర్వేషన్ లేని ప్రయాణికులు అనుమతి లేకుండా రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రవేశిస్తే రూ. 2,000, ఒకవేళ తాము కూర్చున్న రిజర్వ్ బెర్తును అసలైన ప్రయాణికుడి కోసం ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ. 1,000 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారికి రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు, రైల్వే ఆవరణలోకి అనధికారికంగా ప్రవేశించినా, రైల్వే ట్రాఫిక్ సిగ్నళ్లను ఉల్లంఘించినా రూ. 500 చొప్పున ఫైన్ వేస్తారు. అలాగే, టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతించిన దూరానికి మించి ప్రయాణించడం, ఇతరుల టికెట్లతో ప్రయాణించడం లాంటి తప్పులకు పాల్పడితే అసలు ప్రయాణ ఛార్జీలతో పాటు అదనంగా రూ. 500 పెనాల్టీ వసూలు చేయనున్నారు.
ఈ సరికొత్త నిబంధనల ప్రకారం ఉల్లంఘనదారుల నుంచి జరిమానా రుసుములను అక్కడికక్కడే వసూలు చేసి, వారికి అధికారిక రసీదు (ఫామ్) అందజేస్తారు. ఒకవేళ ఎవరైనా జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, వారిపై రైల్వే పోలీస్ స్టేషన్లో తక్షణమే కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులకు నేరుగా ఇలాంటి జరిమానాలు వసూలు చేసే చట్టపరమైన అధికారాలు ఉండేవి కావు. కానీ, మారిన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ జూన్ 15వ తేదీ నుంచే ఆర్పీఎఫ్ అధికారులకు ఈ ప్రత్యేక అధికారాలు కల్పించడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.







