Mahaa Daily Exclusive

  రైతన్న భూములకు కట్టుదిట్టమైన భద్రత…

Share

రైతన్న భూములకు కట్టుదిట్టమైన భద్రత.
* పట్టాదారు పాస్‌పుస్తకాల జారీలో సరికొత్త రికార్డు.
*సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక.
* కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలకు శాశ్వత చెక్.
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని రైతుల భూములకు పూర్తి స్థాయి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు, ఎవరికీ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు అందించడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా రైతాంగాన్ని పీడిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న నూతన సంస్కరణలను, చట్టాల పనితీరును ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
**దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌పుస్తకం**
గతంలో ఒక చిన్న పాస్‌పుస్తకం కోసం అన్నదాతలు నెలల తరబడి, చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం ఆ కష్టాలకు శాశ్వత ముగింపు పలికిందని మంత్రి పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన ‘భూ భారతి’ చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 3.65 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను రికార్డు స్థాయిలో జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతు దరఖాస్తు చేసుకున్న వెంటనే, ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా, అత్యంత వేగవంతంగా పాస్‌పుస్తకం వారి చేతికి అందేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశామన్నారు. అన్నదాత ఒక్కసారి దరఖాస్తు చేస్తే చాలు.. పనులు పూర్తి చేసుకుని వెళ్లేలా అధికారుల పనితీరు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బంది పెట్టకూడదని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు.
**రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలం**
కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం.. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల సమయంలో, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జత చేసే విధానంపై మంత్రి సమీక్షించారు. కొనుగోలు, అమ్మకాల సమయంలో భవిష్యత్తులో ఎలాంటి సరిహద్దు వివాదాలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం ఈ సరికొత్త విధానాన్ని రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, ఇది అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ ఐదు మండలాల్లో ఎదురైన క్షేత్రస్థాయి అనుభవాలను, చిన్నచిన్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని లోపాల్లేని వ్యవస్థను తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. త్వరలోనే రెండో దశ కింద రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి, అక్కడ సర్వే మ్యాప్‌లతో కూడిన రిజిస్ట్రేషన్ల విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
**ఆరు లక్షల సాదాబైనామాలకు నోటీసులు**
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో మరింత వేగం పెంచాలని మంత్రి అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులు ఉండగా, ఇప్పటి వరకు ఆరు లక్షల మంది దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. మిగిలిన దరఖాస్తులన్నింటికీ రాబోయే 15 రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని గడువు విధించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే, అర్హులైన రైతుల దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.
**గత ప్రభుత్వానిది క్షమించరాని నిర్లక్ష్యం**
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సాదాబైనామా సమస్య ఇంత జటిలమైందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం హడావుడిగా దరఖాస్తులను స్వీకరించినప్పటికీ, వాటి పరిష్కారానికి సంబంధించి 2020 ఆర్వోఆర్ చట్టంలో ఎలాంటి స్పష్టమైన నిబంధనలు పొందుపరచలేదని మండిపడ్డారు. సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లనే వేలాది మంది అమాయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడును అర్థం చేసుకున్న తమ ప్రజా ప్రభుత్వం.. వెంటనే ఆ చట్టంలోని లోపాలను సరిదిద్ది, నిబంధనలను సవరించి దరఖాస్తుదారులకు సంపూర్ణ న్యాయం జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.