Mahaa Daily Exclusive

  పరవాడలో తీవ్ర విషాధం… ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం….

Share

  • పరవాడలో తీవ్ర విషాధం
  • ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
  • నలుగురు కార్మికులు సజీవదహనం

అనకాపల్లి, మహా : జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీ పరిధిలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాదకర గ్యాస్ లీకవుతుందని, ఫ్యాక్టరీలో మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని సెజ్ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

మంటల్లో చిక్కుకున్న మరికొందరు

ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ లోపల మరికొందరు కార్మికులు కూడా మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరుకున్నారు. వారు ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలేమిటన్న అంశంపై దర్యాప్తు సాగుతోంది.

హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె స్పందించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో ఆమె ఫోన్‌లో మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరు, అక్కడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.

ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధితులు, వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి అనిత పేర్కొన్నారు.