Mahaa Daily Exclusive

  రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం!

Share

రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం!
*కాంగ్రెస్ పాలనలో ఆగమాగమైన రాష్ట్రం.
* మళ్లీ కేసీఆర్ రావాలంటున్న తెలంగాణ సమాజం.
* రైతుబంధు, నిరుద్యోగ హామీల్లో సర్కారు ఘోర వైఫల్యం.
* సత్తుపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం.
సత్తుపల్లి , మహా.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని, ఆయన కేవలం ‘రెన్యువల్‌ సీఎం’ మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమవుతుందని ఎన్నికల నాడే కేసీఆర్ హెచ్చరించారని, ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 72 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి రాష్ట్రానికి సాధించిందేమిటో సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలన పోవాలని, మళ్లీ కేసీఆర్ సుపరిపాలన రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధికి పటిష్టమైన పునాది రాళ్లు వేసుకున్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలంటే అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములను చూశారని, నాడు తెలుగుదేశం పార్టీలో అన్నగారు ఎన్టీఆర్ తో కలిసి నడిచిన అపార అనుభవం ఆయన సొంతమని కేటీఆర్ కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు పూర్తిస్థాయిలో రైతుబంధు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో స్థానిక రాజకీయాలు, మీడియా సమస్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. పత్రికా విలేకరుల పట్ల సైతం రేవంత్ సర్కార్ వివక్ష చూపుతోందని, సత్తుపల్లి విలేకరులకు కేవలం మండల స్థాయి అక్రిడిటేషన్లు మాత్రమే జారీ చేసి తీరని అన్యాయం చేశారని ఆయన ఆక్షేపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. కల్లూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కచ్చితంగా గెలిచి తీరేదని, సత్తుపల్లిలో సైతం అత్యంత స్వల్ప ఓట్ల తేడాతోనే స్థానాన్ని చేజార్చుకున్నామని ఆయన వివరించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు పార్టీ శ్రేణులు మితిమీరి పొంగిపోకూడదని, అలాగే ఓడిపోయినప్పుడు ఏమాత్రం కృంగిపోకూడదని, నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పోరాడాలని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.