Mahaa Daily Exclusive

  తుంగభద్ర జలాలపై తెలంగాణకు తీరని ద్రోహం!

Share

తుంగభద్ర జలాలపై తెలంగాణకు తీరని ద్రోహం!
* కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు కాంగ్రెస్ సర్కారు వత్తాసు.
* కొడంగల్ ఎన్‌వోసీ కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు.
* సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్నలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ జల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతోందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కర్ణాటక చేపడుతున్న నిర్మాణాలను తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు. సమైక్య పాలనలో నీటి దోపిడీకి గురైన తెలంగాణ, స్వరాష్ట్రంలో కేసీఆర్ కృషితో జలకళను సంతరించుకోగా.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను దాపురించేలా చేస్తోందని ఆయన మండిపడ్డారు.
**కొడంగల్ ఎన్‌వోసీ వెనుక ఉన్న మతలబు అదేనా?**
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి వద్ద ఎత్తిపోతల, బ్రిడ్జి కమ్ బ్యారేజీలను నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని హరీశ్ రావు నిలదీశారు. కమీషన్ల కోసం తెరపైకి తెచ్చిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి కేవలం ఒక నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సాధించడం కోసమే.. తుంగభద్రపై ఆ రాష్ట్రం చేస్తున్న అక్రమ నిర్మాణాలకు రేవంత్ సర్కారు సమ్మతి తెలిపిందా అని సూటిగా ప్రశ్నించారు. ఏడాదిగా కర్ణాటక ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క అభ్యంతర లేఖ కూడా వెళ్లకపోవడం ఈ లోపాయికారీ ఒప్పందానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా కర్ణాటక తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోవడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు.
**పాలమూరు ప్రాజెక్టులకు పెను ముప్పు**
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పరిధిలో కర్ణాటక వాటా కేవలం 1.2 టీఎంసీలు కాగా, ఆ రాష్ట్రం అక్రమంగా సగటున 5 టీఎంసీల నీటిని వాడుకుంటోందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏకంగా ఆర్డీఎస్ ఆనకట్టకు కేవలం వంద మీటర్ల ఎగువన 85 కోట్ల రూపాయలతో కురిడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుండటం వల్ల తెలంగాణ చివరి ఆయకట్టుకు చుక్క నీరందే పరిస్థితి ఉండదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ కష్టాలను తీర్చేందుకు నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో పాటు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భీమా ప్రాజెక్టుల భవిష్యత్తు కూడా ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భీమా ప్రాజెక్టుకు కేటాయించిన నీటిలో ఏడు టీఎంసీలను కొడంగల్ లిఫ్టుకు మళ్లించి రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల శ్రీశైలానికి వచ్చే వరద తగ్గిపోయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం అవుతాయని ఆయన హెచ్చరించారు.
**వెంటనే న్యాయ పోరాటం చేయాలి**
తెలంగాణ జల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొనాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను వెంటనే అడ్డుకోవాలని, ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ), సీడబ్ల్యూసీకి అధికారికంగా అభ్యంతరాలు తెలపాలని ఆయన స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలకు కర్ణాటక కట్టుబడి ఉండేలా చూడటంతో పాటు, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టలేదని ప్రభుత్వం చేతల్లో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, పాలమూరు రైతాంగం కోసం ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడుతామని హరీశ్ రావు తేల్చిచెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.