భారతీయులు రూపాయి తీయరు.
* ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలన్న జేడీ వాన్స్ ప్రతిపాదనపై ట్రంప్ నవ్వులు.
* మోదీ నాకు మంచి దోస్తే.. కానీ ఇలాంటి వాటికి పైసా ఖర్చు పెట్టరు.
*ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా ప్రెసిడెంట్ తీవ్ర వ్యాఖ్యలు.
* వైట్ హౌస్ రహస్య భేటీ నిజాలను బట్టబయలు చేసిన ‘రెజీమ్ చేంజ్’ పుస్తకం.
వాషింగ్టన్, మహా.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య వైట్ హౌస్‌లో జరిగిన ఒక అత్యంత రహస్య భేటీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే జేడీ వాన్స్ ప్రతిపాదనను ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని.. “భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరు” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఒక సరికొత్త పుస్తకం వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టులు మాగీ హేబర్‌మన్, జోనాథన్ స్వాన్ సంయుక్తంగా రాసిన ‘రెజీమ్ చేంజ్’ అనే పుస్తకంలో ఈ ఆసక్తికరమైన సంభాషణను పొందుపరిచారు.
**ఓవల్ ఆఫీస్ సమావేశంలో అసలేం జరిగింది?**
సదరు పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం పది రోజులకే, అంటే 2025 జనవరి 30న వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ఉక్రెయిన్-రష్యా శాంతి రాయబారిగా ట్రంప్ నియమించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లాగ్ ఈ భేటీని ఏర్పాటు చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఆయన ‘ఆన్ అమెరికా ఫస్ట్ ప్లాన్’ పేరిట ఒక ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టారు. ఈ ప్లాన్ ప్రకారం.. ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా హక్కులను అమెరికా అధికారికంగా గుర్తించదు. అదే సమయంలో, ఆ ప్రాంతాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకోబోమని ఉక్రెయిన్ అంగీకరించాలి. ఈ కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి ఇరు దేశాల సరిహద్దుల్లో విదేశీ శాంతిభద్రతల సైన్యాన్ని (పీస్ కీపింగ్ ఫోర్స్) మోహరించాలని కెల్లాగ్ ప్రతిపాదించారు.
**జేడీ వాన్స్ అభ్యంతరం.. భారత్ పేరు తెరపైకి!**
కెల్లాగ్ తన ప్లాన్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపవచ్చని పేర్కొన్నారు. అయితే దీనిని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. నాటో కూటమి దేశాల సైన్యం కనుక ఉక్రెయిన్ సరిహద్దుల్లో అడుగుపెడితే, దానిని రష్యా తీవ్రమైన ఉసిగొల్పు చర్యగా భావిస్తుందని, దీనివల్ల యుద్ధం మరింత పెరిగి అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. యూరోపియన్ దేశాలకు ప్రత్యామ్నాయంగా నాటోతో సంబంధం లేని తటస్థ దేశాల సైన్యాన్ని పరిశీలించాలని జేడీ వాన్స్.. జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్‌ను కోరారు. ఇందుకు వాల్ట్జ్ కూడా అంగీకరించడంతో.. రష్యాకు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్, అలాగే సౌదీ అరేబియా దేశాల సైన్యాన్ని శాంతిభద్రతల పర్యవేక్షణకు వాడుకుంటే ఎలా ఉంటుందని జేడీ వాన్స్ సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
**మోదీ నాకు మంచి దోస్తే.. కానీ!**
జేడీ వాన్స్ నోటి నుంచి భారత్ పేరు రాగానే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా నవ్వేస్తూ ఆ ప్రతిపాదనను నిరాకరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు అత్యంత బలమైన, వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయని, మోదీకి తనంటే చాలా ఇష్టమని, ఆయన త్వరలోనే అమెరికా పర్యటనకు రావాలని అనుకుంటున్నారని ట్రంప్ ప్రస్తావించారు. అయితే అసలు విషయానికొచ్చేసరికి.. “భారతీయులు ఎప్పటికీ దేనికీ సులభంగా డబ్బులు చెల్లించరు. ఇలాంటి అంతర్జాతీయ సైనిక మిషన్ల కోసం వారు రూపాయి కూడా ఖర్చు పెట్టరు” అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో, బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దేశాలు తమ సొంత ఖర్చులతో, అమెరికాపై ఎలాంటి ఆర్థిక లేదా సైనిక భారం పడకుండా ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపుతామంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.
**జెలెన్‌స్కీ ఒక అట్టర్ ఫ్లాప్ నెగోషియేటర్!**
అదే సమయంలో ఉక్రెయిన్ నాయకత్వంపై ట్రంప్ ప్రభుత్వానికి ఉన్న తీవ్ర అవిశ్వాసం ఈ భేటీలో స్పష్టంగా కనిపించిందని పుస్తక రచయితలు పేర్కొన్నారు. సమావేశం జరుగుతున్నంతసేపూ ట్రంప్ మధ్యమధ్యలో కల్పించుకుంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెలెన్‌స్కీ ఒక ‘అట్టర్ ఫ్లాప్ నెగోషియేటర్’ అని, ఆయన తన చేతులతో తన దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే జో బైడెన్ గత ప్రభుత్వం నుంచి ఉచితంగా వందలాది కోట్ల డాలర్ల ఆయుధాలు, నిధులు రాబట్టడంలో మాత్రం జెలెన్‌స్కీ మహా దిట్ట అని ట్రంప్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి అని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వైట్ హౌస్ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సదరు పుస్తకంలో రచయితలు రాసుకొచ్చారు.








