Mahaa Daily Exclusive

  జొన్నగిరిలో పసిడి తవ్వకాలకు శ్రీకారం…..

Share

జొన్నగిరిలో పసిడి తవ్వకాలకు శ్రీకారం..
* అధికారికంగా ప్రారంభించిన ఏపీ సీఎం .
* రాయలసీమ ముఖచిత్రం మారనుంది.
* యువత, మహిళలకు భారీగా ఉపాధి.
* ముఖ్యమంత్రి చంద్రబాబు.
* తొలి పసిడి స్థానిక వ్యాపారులకే.. జియోమైసూర్ సంస్థ కీలక ప్రకటన.
కర్నూలు, మహా.
కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక బంగారు గనుల ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఈ పసిడి తవ్వకాలను లాంఛనంగా ప్రారంభించారు. గత కొంతకాలంగా ఇక్కడ జరిగిన ప్రయోగాత్మక తవ్వకాలు విజయవంతం కావడంతో వాణిజ్యపరమైన ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ గని నుంచి తొలివిడతగా వెలికితీసి శుద్ధి చేసిన బంగారాన్ని రాష్ట్రానికే చెందిన పలువురు ప్రముఖ జ్యుయలరీ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.
రాష్ట్రంలో లభించే సహజ వనరుల ప్రయోజనాలు ముందుగా స్థానికులకే దక్కాలన్న ఉద్దేశంతో మైనింగ్ నిర్వహిస్తున్న ‘జియోమైసూర్’ సంస్థ ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. జొన్నగిరిలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని రాష్ట్రంలోని స్థానిక వ్యాపారులకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏపీ అంతర్గత మార్కెట్, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, స్వర్ణకారులకు నాణ్యమైన పసిడి నేరుగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తొలి బంగారాన్ని వాసవీ జ్యూయలర్స్, సాయి సంతోష్ జ్యుయలర్స్, మధుమూర్తి జ్యుయలర్స్, ఎమరాల్డ్ జ్యుయలర్స్ సంస్థలకు సీఎం పంపిణీ చేశారు.
గనుల తవ్వకాల్లో స్థానికులకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు.. మైనింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిమ్యులేటర్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. గనుల్లో మట్టిని, ఖనిజాన్ని తరలించే భారీ లారీలు, టిప్పర్లను నడపడంలో స్థానిక మహిళలు, యువతకు ఇస్తున్న డ్రైవింగ్ శిక్షణను అడిగి తెలుసుకున్నారు. మహిళలు సైతం ఉపాధి దిశగా ఈ భారీ వాహనాలు నడిపేలా శిక్షణ పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఖనిజాన్ని తరలించే భారీ మైనింగ్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జొన్నగిరి ప్రాజెక్టుతో రాయలసీమపై ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర శాశ్వతంగా చెరిగిపోనుందని, దేశంలోనే రాష్ట్రం అతిపెద్ద పసిడి సరఫరాదారుగా సరికొత్త రికార్డు సృష్టించబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. వేలాది మంది యువత, మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ బంగారు గని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం భరోసా ఇచ్చారు. గురువారం నుంచి ఈ గనిలో పూర్తిస్థాయి వాణిజ్యపరమైన తవ్వకాలు ప్రారంభం కానున్నాయి.