ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట.
* నాటి కోవిడ్ ఉల్లంఘన కేసు కొట్టివేత.
* రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు.
* రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021వ సంవత్సరంలో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచార సమయానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి కమలాపూర్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఆ సమయంలో అమల్లో ఉన్న కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన దానికంటే ఎక్కువ మంది జనాన్ని సమీకరించి సభలు, సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా స్థానిక కమలాపూర్ పోలీసులు అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగింది. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నాటి ఎన్నికల ప్రచార సమయంలో తన క్లయింట్ కోవిడ్ నిబంధనలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు పాటించారని కోర్టుకు వివరించారు. అప్పటి అధికార ప్రభుత్వం కేవలం రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే ఈ కేసును అక్రమంగా నమోదు చేయించిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసింది. ఆయనపై ఉన్న కేసును పూర్తిగా కొట్టేస్తూ న్యాయస్థానం తుది ఉత్తర్వులు వెలువరించింది.








