సెల్లార్లలో కోచింగ్ సెంటర్లపై నిషేధం.
* అగ్నిమాపక నిబంధనలపై సీఎం యోగి కఠిన ఆదేశాలు.
* అక్రమ కట్టడాలపై లక్నోలో ప్రత్యేక డ్రైవ్.
ఢిల్లీ, మహా.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా బేస్‌మెంట్‌లలో (సెల్లార్లలో) నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, ఇతర వాణిజ్య సముదాయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్నో పౌర అధికారులు నగరంలోని అక్రమ కట్టడాలపై భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్న వాణిజ్య సంస్థలను గుర్తించి చర్యలు చేపడుతున్నారు.
ప్రాణనష్టం జరిగిన తర్వాతే యంత్రాంగం మేల్కొనడం, ప్రతి ప్రమాదం తర్వాత ఇలాంటి హామీలే రావడంపై ప్రజల నుంచి కొంత పెదవివిరుపు కనిపిస్తున్నప్పటికీ.. తాజా మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.







