Mahaa Daily Exclusive

  ఫీజు రీఎంబర్స్ మెంట్ కేసు….

Share

  • ఫీజు రీఎంబర్స్ మెంట్ కేసు
  • హైకోర్టులో ప్రైవేట్ కళాశాలలకు ఊరట
  • ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన కోర్టు
  • విచారణ 30 వ తేదీకి వాయిదా

హైదరాబాద్, మహా : హైకోర్టులో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతోపాటు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ సర్కార్ తీసుకొచ్చిన జీవో 9పై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. వచ్చే మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా.. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటే యాజమాన్యాలు ప్రైవేటు కాలేజీలను ఎలా నడుపుతారని నిలదీసింది. అదే సమయంలో రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయాయని.. ఇంకా పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఆగిపోవడంతో కాలేజీలను నడపడం కష్టంగా మారిందని.. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం కూడా కాలేజీలకు భారంగా మారిందని హైకోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే ప్రైవేటు కాలేజీలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ఎప్పటి లోగా చెల్లిస్తారో చెప్పారని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీ లోపు అన్ని బకాయిలను క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రైవేటు కాలేజీల తరఫు వాదనలు వినిపిస్తున్న లాయర్ ఆగస్టు 15వ తేదీ లోపు బకాయిలు మొత్తం క్లియర్ చేస్తే ఆరోజే తాము దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని హైకోర్టుకు విన్నవించారు.

ఇక ఈ వ్యవహారంలో పలువురు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు తీవ్రంగా నలిగిపోతున్నారని విద్యార్థుల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ పెండింగ్ బకాయిల ద్వారా విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోర్టును కోరారు. ఈ ఏడాది కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.