Mahaa Daily Exclusive

  బీసీ గురుకులాల్లో విద్యా విప్లవం….

Share

బీసీ గురుకులాల్లో విద్యా విప్లవం.

* పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు!

* సాంకేతికతకు పెద్దపీట.. ఐఐటీ, నిట్ సాధకులుకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.

* విద్యార్థి మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా.

* రాష్ట్రంలో కొత్తగా 12 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సమగ్ర నివేదిక.

* మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయాలు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచస్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గురుకుల విద్యాసంస్థల రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులను చేరువ చేసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం.. బీసీ గురుకులాల బలోపేతం, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పలు కీలక ప్రతిపాదనలకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను జోడించి, రేపటి పోటీ ప్రపంచానికి వారిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే మహత్తర ప్రణాళికలకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.

విద్యాసంస్థల ఆధునికీకరణలో భాగంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల విద్యాసంస్థల పేరును ఇకపై ‘టీజీడబ్ల్యూసీడబ్ల్యూఎంజేపీఆర్‌ఈఐఎస్’ (TGWCWMJPREIS)గా మార్పు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభకు పట్టం కడుతూ, జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఉన్నత విద్యలో రాణించే పేద విద్యార్థులకు ఇది ఒక గొప్ప వరంగా మారనుంది. ఆధునిక బోధనా పద్ధతుల కోసం గురుకుల పాఠశాలల్లో సరికొత్త డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలుకు సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా, జూనియర్ కళాశాలల్లో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతూ, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (స్మార్ట్ బోర్డులు) సరఫరా చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

పరిపాలనాపరమైన, సంక్షేమపరమైన సంస్కరణల దిశగానూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటైన నిర్ణయాలు తీసుకున్నారు. అత్యంత దురదృష్టవశాత్తూ విద్యాసంస్థల్లో ఏ విద్యార్థి అయినా మరణిస్తే, తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంజేపీ వ్యవసాయ కళాశాలల్లో కేవలం ఎంజేపీ గురుకుల విద్యార్థులకే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించడం ద్వారా సొంత విద్యార్థులకు ప్రాధాన్యతను పెంచారు. గురుకులాల నిర్వహణ నాణ్యతను పెంచే క్రమంలో.. అనుభవజ్ఞులైన రిటైర్డ్ ప్రిన్సిపాళ్ల సేవలను వృథా పోనివ్వకుండా, వారిని అకడమిక్ కన్సల్టెంట్లుగా నియమించే అంశంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రిన్సిపాళ్ల నియామకాల్లో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకాల విధానాన్నే పకడ్బందీగా అమలు చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యను అందించే దిశగా.. కొత్తగా 12 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి స్థాయి నివేదికను వెంటనే తమకు సమర్పించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా ఆదేశించారు. అలాగే, పాఠశాలలు, కళాశాలల నిర్వహణకు సంబంధించిన బడ్జెట్ పరిమితులకు ఆమోదం తెలిపారు. పోటీ పరీక్షల్లో బీసీ విద్యార్థులు అత్యుత్తమ విజయాలు సాధించేలా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి ఉద్ఘాటించారు. గురుకులాలను అన్ని విధాలా బలోపేతం చేసి తీరుతామని, విద్యా రంగంలో నిధుల కొరత లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో బీసీ గురుకులాల్లో కొత్త వెలుగులు రానున్నాయని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.