ఓట్ల ప్రక్షాళనకు రాజకీయ రంగు వద్దు.
* ‘సర్’ ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ.
* నకిలీ ఓట్ల ఏరివేతే ప్రధాన లక్ష్యం.
* ప్రతిపక్షాల దుష్ప్రచారంపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.
హైదరాబాద్, మహా.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన అత్యంత కీలకమైన ‘సర్’ (SIR – ఓటర్ల ధృవీకరణ) ప్రక్రియకు రాజకీయ రంగు పులమడం తగదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య బలోపేతానికి పారదర్శకమైన ఓటర్ల జాబితా ఎంతో అవసరమన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలోని నకిలీ, బోగస్ ఓట్లను ఏరివేయడమే ‘సర్’ ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరించారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి అత్యంత బాధ్యతాయుతంగా వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఇంతటి పవిత్రమైన విధి నిర్వహణలో ఉన్న అధికారులను, సాధారణ ప్రజలను గందరగోళానికి గురిచేసేలా కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే అపోహలు సృష్టించడం విచారకరమన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను తప్పుబట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ఓటర్ల సవరణ కార్యక్రమాలు జరిగాయన్న విషయాన్ని కిషన్రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని, దీనికి రాజకీయ కోణం ఆపాదించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలను నిలదీశారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పన అందరి బాధ్యతని.. కాబట్టి ప్రజలు కూడా రాజకీయ పార్టీలు సృష్టించే ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారులకు సహకరించి, ఈ ప్రక్రియలో చురుగ్గా భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.







