Mahaa Daily Exclusive

  భారత్‌పై అమెజాన్‌ పెట్టుబడుల వర్షం…..

Share

భారత్‌పై అమెజాన్‌ పెట్టుబడుల వర్షం.

* 2030 నాటికి ఏకంగా 48 బిలియన్ డాలర్లు.

* ఏఐ, క్లౌడ్ మౌలిక వసతులపైనే ప్రధాన దృష్టి.

* ప్రధాని మోదీతో భేటీలో సీఈఓ ఆండీ జెస్సీ వెల్లడి.

ఢిల్లీ, మహా.

భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు, సాంకేతిక అభివృద్ధికి తాము పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ స్పష్టం చేశారు. దేశంలో తమ వ్యాపార విస్తరణలో భాగంగా 2030 నాటికి అదనంగా మరో 13 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా భారత్‌లో తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను ప్రధానికి వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆండీ జెస్సీ ‘ఎక్స్‌’ (ట్విటర్) వేదికగా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లోని ఎందరో వ్యాపారులకు తాము విశేష సేవలందిస్తున్నామని, అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

భారత మార్కెట్‌పై తమకున్న అపార నమ్మకానికి నిదర్శనంగా 2030 నాటికి దేశంలో మొత్తంగా 48 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సీఈఓ వెల్లడించారు. కాగా, 2026-30 మధ్య కాలంలో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ గతేడాదే ప్రకటించిన విషయం విధితమే. తాజా ప్రకటనతో ఆ మొత్తం 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ నిధుల్లో 21 బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని కేవలం కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ మౌలిక సదుపాయాల కల్పన కోసమే కేటాయించనున్నట్లు జెస్సీ స్పష్టం చేశారు. అమెజాన్ అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల్లో భారతదేశ ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా దేశ సామాజిక, ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా అమెజాన్ బృహత్తర లక్ష్యాలను నిర్దేశించుకుందని ఆండీ జెస్సీ వివరించారు. 2030 సంవత్సరం కల్లా దేశంలో ఏకంగా 38 లక్షల (3.8 మిలియన్ల) కొత్త ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, 80 బిలియన్ డాలర్ల మేర ఈ-కామర్స్ ఎగుమతులను సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉన్న చిన్నతరహా వ్యాపారాలకు, ప్రభుత్వ పాఠశాలలకు సైతం కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ప్రయోజనాలను చేరువ చేసేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని వివరించారు. మొత్తంగా భారత్‌లో డిజిటల్ విప్లవానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అమెజాన్ సీఈఓ ఈ సందర్భంగా ప్రధానికి హామీ ఇచ్చారు.