Mahaa Daily Exclusive

  అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి…

Share

అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి.
* ఉండవల్లి జోన్‌-11 మౌలిక వసతుల పనులకు సర్కారు ఆమోదం.
* రూ.426.46 కోట్లతో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు.
* ఎన్‌సీసీ లిమిటెడ్‌కు దక్కిన కాంట్రాక్ట్.. జీవో జారీ.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని ఉండవల్లి జోన్-11లో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సర్కారు పచ్చజెండా ఊపింది. మొత్తం రూ.426.46 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా జీవో ఆర్టీ నెం.777ను జారీ చేసింది. రాజధాని భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ‘ప్యాకేజీ-38’ కింద ఈ పనులను చేపట్టనున్నారు.
ఈ మెగా ప్రాజెక్టు కింద ఉండవల్లి జోన్ పరిధిలో అత్యాధునిక రహదారులు, వరద నీటి కాలువలు (డ్రైన్లు), తాగునీటి సరఫరా వ్యవస్థ, భూగర్భ మురుగునీటి పారుదల (సెవరేజ్) నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. వీటితో పాటు భూగర్భ విద్యుత్ సరఫరా లైన్లు, ఐసీటీ యుటిలిటీ డక్ట్లు, పునరుత్పాదక నీటి పైప్‌లైన్లు (రీయూజ్ వాటర్ లైన్), వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ), రహదారుల ఇరువైపులా పచ్చదనం (అవెన్యూ ప్లాంటేషన్) వంటి సమగ్ర వసతులను ఈ ప్యాకేజీలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనుల టెండర్లలో ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఎన్‌సీసీ లిమిటెడ్‌’కు కాంట్రాక్టు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనుల అసలు అంచనా వ్యయం రూ.409.78 కోట్లు కాగా.. నిబంధనల ప్రకారం 4.07 శాతం అధిక బిడ్‌కు ప్రభుత్వం అనుమతించింది.
ఈ ప్రాజెక్టు కాలపరిమితితో పాటు నిర్మాణానంతరం రెండేళ్ల పాటు లోపభూయిష్ట బాధ్యత కాలం (డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్) నిబంధనను నిర్దేశించారు. ఈ నెల 19న జరిగిన ఏపీసీఆర్‌డీఏ ఉన్నత స్థాయి అథారిటీ సమావేశంలో (తీర్మానం నెం.669/2026) ఈ పనులకు ఆమోదం లభించగా, తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ సంస్థకు పనుల కేటాయింపు ఉత్తర్వులు (లెటర్ ఆఫ్ అవార్డ్) జారీ చేసేందుకు వీలుగా అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) సీఎండీకి పూర్తి అధికారాలు అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఏపీసీఆర్‌డీఏ సమకూర్చనుంది. ఉండవల్లి ప్రాంతంలో ఈ సమగ్ర మౌలిక వసతులు అందుబాటులోకి రానుండటంతో రాజధాని ముఖచిత్రం మారడమే కాక, నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకోనుంది.