Mahaa Daily Exclusive

  యూరియాకు ఢోకా లేదు!

Share

యూరియాకు ఢోకా లేదు!
* అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెట్‌పై ఉక్కుపాదం తప్పదు.
* జూలైలోనే ‘రైతు భరోసా’.. రూ.9 వేల కోట్లు విడుదల చేయనున్న సీఎం.
* రాష్ట్రంలో పామాయిల్‌ సాగు, పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట.
* దేశానికే ఆదర్శంగా మన యూరియా యాప్‌.. ప్రధాని మోదీ సైతం ప్రశంసలు.
* 30న ‘రైతు ఆశీర్వాద సభ’.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మం, మహా.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఎరువుల కొరతతో ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అందరికీ సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద జూన్‌ 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని గురువారం మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతాంగాన్ని ఉద్దేశించి పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతుల శ్రేయస్సు దృష్ట్యా అప్పులు తెచ్చి మరీ వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ‘ప్రజా ప్రభుత్వం’ అహర్నిశలు శ్రమిస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
**రూ.9 వేల కోట్లతో రైతు భరోసా.. ఏటా రూ.10 వేల కోట్ల నష్టమైనా కొనుగోళ్లు**
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం, జూలై నెలలోనే రైతులకు ‘రైతు భరోసా’ నిధులను అందించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా రూ.9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారని ప్రకటించారు. అందుకే ఈ నెల 30న నిర్వహించే ముఖ్యమంత్రి సభకు ‘రైతు ఆశీర్వాద సభ’గా అన్నదాతలే నామకరణం చేశారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా పంటలు పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే బాధ్యతగా కొనుగోలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వానికి ఏటా రూ.10 వేల కోట్ల మేర నష్టం వస్తున్నప్పటికీ రైతుల మేలు కోసమే ఈ భారాన్ని భరిస్తున్నామన్నారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా లక్ష కోట్ల రూపాయలను అన్నదాతల చేతికి అందించిన ఘనత తమకే దక్కుతుందని మంత్రి గర్వంగా చెప్పారు.
**పామాయిల్ సాగుతో సరికొత్త విప్లవం.. అందుబాటులో 7 రకాల వరి వంగడాలు**
సాంప్రదాయ వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ (పామాయిల్) సాగును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో అదనంగా మరో పది వేల ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేసేలా పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలోనే జరుగుతోందని, ఇందుకు అనుగుణంగా పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. మరోవైపు వరి సాగు చేసే రైతుల కోసం వాతావరణ పరిస్థితులకు అనువైన 7 రకాల అధునాతన వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయని, వాతావరణాన్ని బేరీజు వేసుకుని పంటలు వేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపైనా రైతాంగం సమాన దృష్టి సారించి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.
**పురుగు మందుల వాడకం తగ్గాలి.. ఆదర్శంగా నిలిచిన ‘యూరియా యాప్’**
పంటలపై విచక్షణారహితంగా పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల మన ఉత్పత్తులను విదేశాలు తిరస్కరిస్తున్నాయని, ఈ పరిస్థితి మారాలని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రియ పద్ధతులు, సురక్షిత వ్యవసాయ విధానాల వైపు మళ్లాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. యాప్‌లో ఎరువుల నిల్వలు, పంపిణీ వివరాలు పక్కాగా ఉంటున్నాయని, ఈ విధానం అద్భుతంగా ఉందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారని మంత్రి గుర్తుచేశారు.
**28, 29 తేదీల్లో భారీ వ్యవసాయ ప్రదర్శన.. ముమ్మరంగా సభా ఏర్పాట్లు**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ముందే, అన్నదాతలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28 నుంచి సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ‘రైతు ఎగ్జిబిషన్’ను ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు ఇక్కడే అందుబాటులో ఉండి రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. అనంతరం 30వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొనే ‘రైతు ఆశీర్వాద సభ’ చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, అడుగడుగునా రైతులకు పెద్దపీట వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.