ప్రైవేటు కాలేజీలకు హైకోర్టులో తాత్కాలిక ఊరట!
* ఫీజుల నియంత్రణ ‘జీవో 9’ పై వచ్చే మంగళవారం వరకు స్టే.
* బకాయిలు ఇవ్వరు.. ఫీజులు వసూలు చేయవద్దంటే కాలేజీలెలా నడుస్తాయి?
* ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం.. ఆగస్టు 15 లోగా చెల్లిస్తామన్న ఏజీ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలంగాణ హైకోర్టులో గురువారం స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వివాదాస్పద ‘జీవో నంబర్ 9’ లోని కొన్ని మార్గదర్శకాలపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఉత్తర్వులు వచ్చే మంగళవారం (జూన్ 30) వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది.
ఈ సందర్భంగా విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. “ప్రభుత్వం తరఫున మీరేమో కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించరు.. అటు విద్యార్థుల నుంచి కూడా యాజమాన్యాలు ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధిస్తే అసలు విద్యాసంస్థలను ఎలా నడుపుతారు?” అని ధర్మాసనం నిలదీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో ఎంత మొత్తం కేటాయించారో చెప్పాలని ఆదేశించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసినా కూడా బకాయిలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను ఎప్పటి లోగా క్లియర్ చేస్తారో స్పష్టమైన గడువు తెలపాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ లోపు బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు స్పందిస్తూ.. ఒకవేళ ఆగస్టు 15 నాటికి బకాయిలు మొత్తం చెల్లిస్తే తాము దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు విన్నవించాయి. ఇదే తరుణంలో ఈ కేసులో విద్యార్థులు సైతం ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య నడుస్తున్న ఈ వివాదంలో తాము నలిగిపోతున్నామని విద్యార్థుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ బకాయిల గొడవ వల్ల ప్రస్తుతం చదువుకుంటున్న రెండు, మూడు, నాల్గవ సంవత్సరం (2, 3, 4 ఇయర్) విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ఒకవేళ ఆంక్షలు విధించాలనుకుంటే ఈ ఏడాది కొత్తగా చేరే విద్యార్థులకే వర్తించేలా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (జూన్ 30) వాయిదా వేసింది.








