Mahaa Daily Exclusive

  ఇంటర్నెట్‌లో ‘హత్య’ పాఠాలు…

Share

ఇంటర్నెట్‌లో ‘హత్య’ పాఠాలు.
* వ్యాపారవేత్త మర్డర్‌ కేసులో షాకింగ్‌ నిజాలు!
*లోహగడ్‌ కోట లోయలోకి నెట్టి కేతన్‌ అగర్వాల్‌ దారుణ హత్య.
* ఆరు నెలల్లో 2,004 సార్లు మాట్లాడుకున్న నిందితులు సియా, చేతన్‌.
*డిజిటల్‌ ఆధారాలతో గుట్టురట్టు చేసిన పుణె పోలీసులు.
పుణె,మహా.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను అదుపులోకి తీసుకుని పోలీసులు జరుపుతున్న విచారణలో వారి నేరపూరిత కుట్ర బట్టబయలైంది. కేతన్‌ను అంతమొందించేందుకు నిందితులిద్దరూ ముందే పక్కా స్కెచ్‌ వేశారని, అసలు ఒక మనిషిని ఎలా హత్య చేయాలనే అంశాలపై రోజులకు ముందు నుంచే ఇంటర్నెట్‌లో విస్తృతంగా శోధించినట్లు సాంకేతిక విచారణలో తేలింది. ఎన్ని రకాలుగా ప్రాణాలు తీయవచ్చో ఆన్‌లైన్‌లో చదివి తెలుసుకున్న నిందితులు.. చివరకు ఈ నెల (జూన్) 18వ తేదీన తమ ఘాతుకానికి ఒడిగట్టారు. చారిత్రాత్మక లోహగడ్ కోట వద్ద కేతన్‌ను నమ్మించి లోతైన లోయలోకి తోసి కిరాతకంగా చంపేశారు.
**238 గంటల సంభాషణలు.. కేఫ్‌లో తుది వ్యూహం!**
ఈ హత్యకు సంబంధించిన వివరాలను పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు గడిచిన ఆరు నెలల కాలంలో నిందితులు సియా, చేతన్ ఇద్దరూ ఏకంగా 2,004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్లు ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణలో తేలిందని ఆయన వివరించారు. వీరద్దరూ దాదాపు 238 గంటల పాటు నిరంతరం సంభాషణలు సాగించారని పేర్కొన్నారు. నిందితుల డిజిటల్ ఫుట్‌ప్రింట్, ఇంటర్‌నెట్ సెర్చ్ హిస్టరీ, కమ్యూనికేషన్ రికార్డులే ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులు ఇద్దరూ ప్రతీరోజు సాధారణ కాల్స్‌తో పాటు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వాట్సాప్, ఫేస్‌టైమ్ యాప్‌ల ద్వారా కూడా నిరంతరం టచ్‌లో ఉన్నారని, ఈ అసాధారణ కమ్యూనికేషనే తమకు వారిపై బలమైన అనుమానం కలిగేలా చేసిందని వెల్లడించారు.
హత్య జరిగిన రోజున లోహగడ్ కోటకు వెళ్లేముందు నిందితులు ఇద్దరూ స్థానికంగా ఉన్న ఒక కేఫ్‌లో కలుసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడ కూర్చుని కేతన్‌ మర్డర్ ప్లాన్‌కు సంబంధించిన చివరి ఏర్పాట్లపై వారు చర్చించుకున్నట్లు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల ద్వారా స్పష్టమైంది. ఆరు నెలల కాలంలో ఇద్దరి మధ్య జరిగిన వందలాది ఫోన్ కాల్స్, గంటల తరబడి సాగిన సంభాషణల వెనుక ఈ హత్య తాలూకు పక్కా గూడుపుఠాణీ దాగి ఉందని టెక్నికల్ అనాలసిస్‌లో రుజువైంది. చాలా రోజుల ముందే ప్లాన్ చేసి, ఇంటర్నెట్ సాయంతో పక్కాగా అమలు చేసిన ఈ ఘాతుకంపై పుణె పోలీసులు కేసును మరింత వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు.