Mahaa Daily Exclusive

  రియల్‌ ఎస్టేట్‌ను పాతాళానికి తొక్కారు!

Share

రియల్‌ ఎస్టేట్‌ను పాతాళానికి తొక్కారు!
* కోటి పలికిన ఎకరం.. ఇప్పుడు 60 లక్షలకే దొరకని కొనుగోలుదారులు.
* రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో హామీలన్నీ బుట్టదాఖలే.
* 2028లో కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి: కేటీఆర్‌.
* చేవెళ్ల సభలో రేవంత్‌ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజం.
చేవెళ్ల,మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఎన్నికలకు ముందు రియల్ ఎస్టేట్ గురించి గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని మండిపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం, ‘ఎస్‌ఐఆర్’ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్‌ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో ఎకరం రూ.కోటి పలికిన భూమి, ఇప్పుడు రూ.50-60 లక్షలకు అమ్ముదామన్నా కొనుగోలుదారులు దొరకని దైన్య స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేశామని కేటీఆర్ గుర్తుచేశారు. షాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్‌పన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను రప్పించిన ఘనత తమదేనన్నారు. నాడు పరిశ్రమల విస్తరణతో ఒకప్పుడు రూ.30 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువ ఏకంగా రూ.3 కోట్లకు చేరిందని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతుబంధు, దళితబంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్డ్ భూముల పట్టాల పేరిట ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. వ్యవసాయం కుదేలై అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు.. తమ రెండున్నరేళ్ల పాలనలో చేసిన అప్పుల లెక్కలను ముందుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము చేసిన అప్పులన్నీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చు చేశామని ఆయన కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో పరుగులు పెట్టాలంటే 2028లో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను విజయవంతం చేసి తీరాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.