ఆర్టీసీ బస్సులో తమిళనాడు సీఎం విజయ్ సందడి!
*కొత్తగా 300 ప్రభుత్వ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి.
*కండక్టర్ సీట్లో కూర్చుని ముచ్చట్లు.. డ్రైవర్‌కు ప్రత్యేక అభినందనలు.
చెన్నై, మహా.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం చెన్నై నగర వీధుల్లో ప్రభుత్వ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, వివిధ ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమిళనాడు రవాణా సంస్థ పరిధిలోకి కొత్తగా 300 బస్సులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన బస్సులను ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
**స్టైలిష్ లుక్‌లో సీఎం.. సిబ్బందితో సరదా ముచ్చట్లు**
బస్సులను ప్రారంభించిన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి నేరుగా ఒక బస్సులోకి ఎక్కారు. తెల్లటి చొక్కా, కళ్లద్దాలు ధరించి పక్కా స్టైలిష్ లుక్‌లో కనిపించిన సీఎంను చూసి అక్కడి వారు ఆనందం వ్యక్తం చేశారు. బస్సులోకి వెళ్లిన ఆయన నేరుగా కండక్టర్ సీటు పక్కన కూర్చుని రవాణా శాఖ సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. తోటి మంత్రులు, ఉన్నతాధికారులు పక్కనే నిలబడి చూస్తుండగా.. కండక్టర్‌తో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.
**డ్రైవర్‌కు భుజం తట్టి అభినందన**
బస్సు దిగే ముందు ముఖ్యమంత్రి విజయ్ డ్రైవర్ సీటు వద్దకు వెళ్లారు. విధుల్లో ఉన్న డ్రైవర్ భుజం తట్టి, బాధ్యతాయుతంగా పనిచేయాలంటూ ప్రత్యేకంగా అభినందించారు. సాధారణ ప్రయాణికుడిలా సీఎం విజయ్ బస్సులో ప్రయాణించిన ఈ వినూత్న దృశ్యాలు, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి రవాణా సిబ్బందికి ఇచ్చిన ఈ ప్రోత్సాహంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.








