తుంగభద్ర గేట్లు మారిస్తే..
* మనకు 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుంది?
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీసిన మాజీ మంత్రి హరీశ్‌రావు.
* ఆర్డీఎస్ నీటిపై ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.
హైదరాబాద్, మహా.
తుంగభద్ర డ్యామ్ క్రస్టు గేట్ల మార్పిడి పనుల ప్రారంభాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏదో పెద్ద విజయం సాధించినట్లు సంబరంగా జరుపుకుంటున్నారని, అయితే గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 15.90 టీఎంసీల నీరు అదనంగా ఎలా వస్తుందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుంగభద్ర బోర్డు పరిధిలోని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం సాంకేతిక మరమ్మతులనే తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కింద రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు సాధించారో ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డీఎస్ స్లూయిస్‌లను మూసివేయడం, ఆర్డీఎస్ ఆనకట్టతో పాటు కాలువ మరమ్మతులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఏం చర్చించారో, తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎలాంటి పరిష్కారాలు సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన చట్టబద్ధమైన వాటాను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం ఫోటోల కోసం, రాజకీయ ప్రచారం కోసమే తుంగభద్ర పనుల ప్రారంభోత్సవాలను వాడుకుంటున్నారని విమర్శించారు. కిందిస్థాయి రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా, ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణ పనులను వేగవంతం చేసి ఆయకట్టుకు నీరందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.








