Mahaa Daily Exclusive

  రామకృష్ణారావుకు కీలక బాధ్యతలు!

Share

రామకృష్ణారావుకు కీలక బాధ్యతలు!
*’ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ఎండీగా ప్రస్తుత సీఎస్‌?
*కొలిక్కివచ్చిన నూతన ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ.
*ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
* విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక విభాగం.
* త్వరలో ఈడీతో పాటు ఐదుగురు సెక్టోరియల్ డైరెక్టర్ల నియామకం.
హైదరాబాద్‌, మహా.
రాష్ట్రంలోకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెట్టుబడులను ఆకర్షించే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ’ (ఇన్వెస్ట్‌ తెలంగాణ) పేరుతో ఓ నూతన విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక ఏజెన్సీ పగ్గాలను రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావుకు అప్పగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన ఈ నెల 30వ తేదీన సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన్ను ఇన్వెస్ట్‌ తెలంగాణ విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (ఎండీ) నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విదేశీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడం, పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్‌ పరిచే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 20న అధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పెట్టుబడుల సాధన కోసం ప్రత్యేకంగా ‘ఇన్వెస్ట్‌ సెల్‌’ను ఏర్పాటు చేయాలని, అలాగే పెట్టుబడిదారులు అనుమతుల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించేలా ‘ఎస్కార్ట్‌ ఆఫీసర్‌’ విధానాన్ని తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఆ ఆదేశాల మేరకే ఈ కొత్త ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌కు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. నూతనంగా ఏర్పాటయ్యే ఈ ఇన్వెస్ట్‌ తెలంగాణ ఏజెన్సీలో ఎండీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ), అలాగే ఐటీ, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ తదితర కీలక రంగాలకు సంబంధించి విడివిడిగా మరో ఐదుగురు సెక్టోరియల్‌ డైరెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా శాఖలు, విభాగాలు మాత్రమే పెట్టుబడుల వ్యవహారాలను విడివిడిగా పర్యవేక్షిస్తుండగా.. ఇకపై ఆ బాధ్యతలన్నింటినీ ఈ నూతన ఏజెన్సీ తన భుజాన వేసుకోనుంది. పెట్టుబడిదారులకు ఒకే చోట అన్ని అనుమతులు ఇప్పించడం (సింగిల్ విండో), వారికి సరైన మార్గదర్శకత్వం వహించడం, వివిధ ప్రభుత్వ విభాగాలతో వేగంగా సమన్వయం చేసుకోవడం వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఈ ఏజెన్సీ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రస్తుతం పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించడంలో, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణకు పోటీగా తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఏర్పాటు విషయంలోనూ ఈ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పోటీ వాతావరణంలో దిగ్గజ కంపెనీలను తెలంగాణకు రప్పించాలంటే పూర్తిస్థాయిలో పనిచేసే ఇలాంటి ప్రత్యేక ఏజెన్సీ ఆవశ్యకత ఉందని సర్కారు బలంగా విశ్వసిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో సైతం డేటా సెంటర్లు, గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు ఇటీవల పలు దిగ్గజ కంపెనీలు శంకుస్థాపనలు చేశాయి. ఈ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు చెందిన మరిన్ని సంస్థలను రాష్ట్రానికి రప్పించేలా ఈ ‘ఇన్వెస్ట్‌ సెల్‌’ అహర్నిశలు పనిచేయనుంది. మరోవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో అత్యంత నిష్ణాతుడిగా పేరున్న సీఎస్‌ రామకృష్ణారావు సేవలను రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా కూడా ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం లేకపోలేదని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా పదవీ విరమణ అనంతరం రామకృష్ణారావుకు పరిపాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతలు దక్కడం మాత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

Latest