ఖమ్మం ‘విజయా డెయిరీ’ మూసివేస్తే సహించం.
• ప్రభుత్వ ఆస్తుల దోపిడీకి మంత్రుల భారీ కుట్ర!
• సొంత డెయిరీల కోసం ప్రభుత్వ సంస్థ నిర్వీర్యం.
• డెయిరీ భూములను రియల్ ఎస్టేట్‌కు అప్పగించే పన్నాగం.
• అధికారులతో కుమ్మక్కై వరంగల్ నుంచి పాల సరఫరాకు యత్నం.
• డెయిరీని అంగుళం కదిపినా ఊరుకోం.
• బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి హెచ్చరిక.
ఖమ్మం, జూన్ 25.
ఖమ్మం జిల్లా పాడి రైతులకు ఆశాదీపంగా, దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక ‘విజయా డెయిరీ’ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పాలకుల స్థాయిలో భారీ కుట్ర జరుగుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డెయిరీని ఇక్కడి నుంచి మూసివేసి వరంగల్ నుంచి పాల సరఫరా చేసేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్న రైతుల ఆవేదనతో బీజేపీ నాయకులు గురువారం అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న విజయా డెయిరీ ప్రాంగణాన్ని స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, డెయిరీని ఇక్కడి నుంచి తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నినాదాలు చేశారు. డెయిరీ మూసివేత వార్తల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకునేందుకే తాము ఇక్కడికి వచ్చామని, రైతుల ఆరోపణల్లో పూర్తి నిజముందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై నిప్పులు చెరిగారు. తామేదో జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని, గొప్ప ప్రజాపాలన అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రులు.. తమ కళ్లెదుటే ప్రభుత్వ డెయిరీని మూసివేస్తుంటే ఎందుకు నిద్రపోతున్నారని ఘాటుగా ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి తన సొంత డెయిరీని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, ప్రభుత్వ డెయిరీ ఇక్కడే కొనసాగితే తన ప్రైవేట్ డెయిరీకి రైతుల నుంచి పాల సేకరణ జరగదని, అమ్మకాలకు గండిపడుతుందన్న దురుద్దేశంతోనే ఈ మూసివేత కుట్రకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. పాలకుల కళ్లల్లో ఆనందం చూడటం కోసం కొందరు అధికారులు సైతం వారితో కుమ్మక్కై, ఉద్దేశపూర్వకంగానే డెయిరీలో పాల సేకరణను తగ్గించి, అమ్మకాలు లేకుండా చేసి చివరకు దీనిని ‘సిక్ యూనిట్’ (నష్టాల్లో ఉన్న సంస్థ)గా ప్రకటించేందుకు సర్వశక్తులొడ్డుతున్నారని వారు తీవ్రంగా దుయ్యబట్టారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు రాబందుల్లా కన్నేశారని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాకే చెందిన భూముల మంత్రి కనుసన్నల్లోనే ఈ కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఎక్కడ విలువైన ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని కంప్యూటర్లలో మాయం చేసి, రాత్రికి రాత్రే తమ బినామీల పేర్ల మీదకు మార్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూములతో పాటు, సత్తుపల్లిలోని ఫుడ్ పార్కులో ఉన్న 72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఎలాంటి జీఓలు, కనీస ప్రణాళికలు లేకుండానే ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెట్టారని వారు గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు అత్యంత విలువైన విజయా డెయిరీ భూమిని సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవాలనో లేదా తమ బినామీలకు ధారాదత్తం చేయాలనో అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
వేలాది మంది పాడి రైతులు, డెయిరీపైనే ఆధారపడి పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ ఆస్తులను కాజేయాలని చూసే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు బీజేపీ నేతలు ‘ఖబడ్దార్’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన పాలకులు, తమ చేతిలో అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. విజయా డెయిరీ ప్రస్తుతమున్న ఇందిరానగర్ అడ్రస్‌లోనే కొనసాగాలని, అందరం కలిసికట్టుగా దీనిని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. డెయిరీ మూసివేత ఆలోచనలను తక్షణమే విడనాడి, ఇక్కడే పాల సేకరణను, అమ్మకాలను పెంచేలా అభివృద్ధి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు రాయితీ రుణాలు, డెయిరీ ఫామ్స్ పెట్టుకోవడానికి తగిన ప్రోత్సాహకాలు అందించి పాడి పరిశ్రమను బలోపేతం చేయాలని సూచించారు. కుట్రలను ఆపకపోతే డెయిరీని ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలనివ్వబోమని, ఒకవేళ అధికార అహంకారంతో మొండిగా ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటం జారీ చేసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరు రామలింగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, ప్రధాన కార్యదర్శులు కొత్త వెంకటేశ్వరరావు , నాయుడు రాఘవరావు, ఎస్టీ ఉపాధ్యక్షులు శ్యామ్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ , నకిరేకంటి వీరభద్రం , ఎల్లారావు గౌడ్ , వీరం రాజు, అర్బన్ అధ్యక్షుడు వాకధాని రామకృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి , శాసనాల సాయిరాం , రజినీ రెడ్డి , శ్రీరామనేని మనీ, తాజ్నూత్ భద్రం , దీకొండ శ్యామ్, రీగన్ ప్రతాప్, రాము, తదితరులు పాల్గొన్నారు.








