- రాంగ్ రూట్ ప్రయాణం
- గాల్లో కలిసిన రెండు ప్రాణాలు
- గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్ బైక్
- ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరొకరికి స్వల్ప గాయాలు
- రాంగ్ రూట్ ప్రయాణమే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు
హైదరాబాద్, మహా : ఐటీ కారిడార్ పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ఒక స్కూటీని బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు మార్గంలో ప్రయాణించడంతో పాటు కనీస రక్షణ కవచమైన హెల్మెట్ ధరించకపోవడమే ఈ ఘోర ప్రాణనష్టానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసులు, స్థానిక వర్గాల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి తన బుల్లెట్ బైక్‌పై గచ్చిబౌలి వైపు నుంచి హఫీజ్‌పేట్ వైపు సాధారణ వేగంతో ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో హఫీజ్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపునకు శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బయలుదేరారు. అయితే వారు ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లోకి దూసుకువచ్చారు.
ఫ్లైఓవర్ మలుపు వద్దకు రాగానే.. సరైన మార్గంలో వస్తున్న వినోద్ బుల్లెట్ బైక్.. రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న శ్రీకాంత్, విఠల్‌ల స్కూటీని అతి బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న శ్రీకాంత్, విఠల్ ఇద్దరూ గాల్లోకి లేచి ఫ్లైఓవర్ కాంక్రీట్ రోడ్డుపై చాలా దూరంలో పడిపోయారు. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. ప్రమాద సమయంలో వీరిద్దరూ హెల్మెట్ ధరించకపోవడంతో వారి తలలు రోడ్డుకు అత్యంత బలంగా తగిలి తీవ్రమైన రక్తస్రావమైంది. ఈక్రమంలోనే వారిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కాగా బుల్లెట్ బైక్‌పై ఉన్న వినోద్‌కు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు అయ్యాయి. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసి ఫ్లైఓవర్‌పై వెళ్తున్న మిగతా వాహనదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అంబులెన్సు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే హుటాహుటిన గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అలాగే క్షతగాత్రుడైన వినోద్‌ను చికిత్స నిమిత్తం అదే ఆస్పత్రికి పంపించగా.. వైద్యులు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.








