- మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆగివున్న లారీని ఢీకొట్టిన తూఫాన్ వాహనం
- అక్కడికక్కడే నలుగురు మృతి
- మృతులందరూ హైదరాబాద్ వాసులు
పల్నాడు, మహా : పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో శుకరవారం ఉదయంఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నగరవనం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లారీని, వేగంగా దూసుకొచ్చిన తూఫాన్ వాహనం వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు, గాయపడిన వారు వాహనం లోపలే ఇరుక్కుపోయారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి, గ్యాస్ కట్టర్ల సాయంతో వాహన భాగాలను కట్ చేసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, సత్యనారాయణగా గుర్తించారు. పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక వాహనం అతివేగంగా ప్రయాణించడం వల్ల నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.








