- తుంగభద్ర నీటి వాటాపై సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వాలి
- తెలంగాణకు రావాల్సిన నీటిలో భారీగా కోత పడుతోంది
- సర్ ప్రక్రియపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే
- సంస్థాగత పటిష్టత కోసమే మూడు రోజుల నితిన్ నబిన్ పర్యటన
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, మహా : తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో జరిగిన చర్చల్లో ఏయే అంశాలను ప్రస్తావించారో వివరాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు తుంగభద్ర డ్యామ్‌కు గేట్ల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని రామచంద్రరావు సూచించారు. రెండు కీలక ప్రాజెక్టుల కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, అధికారిక లెక్కల ప్రకారం కేవలం 5 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్ (35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు) వల్ల తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కంటే తక్కువ నీటికి గతంలో కేసీఆర్ సంతకం చేశారని ఆయన ఆరోపించారు.
‘సర్’ ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఐడీ కార్డు ఉంటేనే ‘ఎస్ఐఆర్’ చెల్లుతుందా? పాస్‌పోర్ట్ చెల్లదా? అని ఒవైసీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. పాస్‌పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి నిరూపణ కాదని 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. దలైలామా వద్ద కూడా ఎల్లో పాస్‌పోర్ట్ ఉందని, అంతమాత్రాన ఆయనకు భారత పౌరసత్వం ఉన్నట్లు కాదని పేర్కొన్నారు. ‘సర్’ ప్రక్రియలో గుర్తింపు కోసం 12 రకాల ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్టాలు చదువుకున్న బారిస్టర్ అయిన ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని హితవు పలికారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయభ్రాంతులు సృష్టించవద్దని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను హెచ్చరించారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నితిన్ నబిన్ మూడు రోజుల పర్యటన
రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో పార్టీని అధికార దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాంచందర్ రావు పేర్కొన్నారు. నితిన్ నవీన్ ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారని వెల్లడించారు. ఒక జాతీయ అధ్యక్షుడు మూడు రోజుల పూర్తి సమయాన్ని రాష్ట్రానికి కేటాయించడం తెలంగాణపై వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించిన తరహాలోనే నితిన్ నబిన్ పర్యటన కూడా రాష్ట్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని, పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ అధ్యక్షుడి పర్యటన వివరాలను వెల్లడిస్తూ 28న శంషాబాద్ చేరుకునే నితిన్ నబిన్ అక్కడి రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వివరించారు. రెండవ రోజు ఉదయం విబిఐటి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కాన్ క్లేవ్ లో పాల్గొని, అనంతరం వరంగల్ వెళ్లే మార్గంలో భువనగిరిలో ఘనస్వాగతం అందుకుంటారని తెలిపారు. వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత, ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మూడవ రోజు ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ (స్టేట్ వర్కింగ్ కమిటీ), ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగుపయనమవుతారని, ఈ పర్యటన పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉద్దేశించిందే తప్ప ఎన్నికలతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.








