Mahaa Daily Exclusive

  ఫీజులు సరే… వసతుల మాటేమిటి..

Share

  • ఫీజులు సరే… వసతుల మాటేమిటి
  • ప్రైవేట్ కళాశాలలపై ఎమ్మెల్సీ విజయశాంతి
  • చాలా కాలేజీల్లో వసతులు లేవన్న విజిలెన్స్ నివేదికను గుర్తుచేసిన ఎమ్మెల్సీ
  • ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్, మహా : ప్రైవేట్ కాళాశాలల యాజమాన్యాలు ఫీజులు వసూళ్లతో పాటు, కనీస విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను ఆయా కళాశాలల్లో విద్యా నాణ్యత, ప్రమాణాల అమలుతో ముడిపెట్టాలని ఆమె సూచించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను విజయశాంతి స్వాగతించారు. అయితే, ప్రభుత్వ చెల్లింపులు, విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్ల కోసం ఆరాటపడే యాజమాన్యాలు, నాణ్యమైన విద్యను, కనీస వసతులను అందించడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఫీజులు వసూలు చేసే హక్కు ప్రైవేట్ యాజమాన్యాలకు ఉన్నప్పటికీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను కూడా వారు విధిగా నెరవేర్చాలి” అని ఆమె స్పష్టం చేశారు. గతంలో విజిలెన్స్ కమిషన్ సమర్పించిన నివేదిక సైతం పలు ప్రైవేట్ కళాశాలల్లో సరైన వసతులు లేవని స్పష్టం చేసిన విషయాన్ని విజయశాంతి గుర్తుచేశారు. ఈ అంశాన్ని తాను ఇదివరకే శాసనమండలిలో సైతం ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. ప్రజాధనంతో చెల్లించే రీయింబర్స్‌మెంట్ నిధులు విద్యార్థుల భవిష్యత్తుకు నిజమైన ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని విద్యా సంస్థలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.